నమో రే ప్రోమో: కళాత్మకం ఈ సాంప్రదాయక విజువల్ ట్రీట్
అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం `నాగబంధం`. ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.;
అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం `నాగబంధం`. ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఒక ఎపిక్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట `నమో రే` ప్రోమోను విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను ఒక సరికొత్త భక్తి ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.
ఈ ప్రోమోలో కథానాయికలు నభా నటేష్ , దక్ష నగర్కర్ తమ అద్భుతమైన ఆహార్యం , నృత్యంతో అందరినీ ఆకర్షిస్తున్నారు. నభా ఎరుపు రంగు చీరలో ధగధగ మెరిసిపోతుంటే, దక్ష కూడా తళుకుబెళుకుల చీరలో మురిపిస్తోంది. ముఖ్యంగా వారి కట్టు, బొట్టు, ట్రెడిషన్ ప్రతిదీ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ సినిమా వీరిద్దరి కెరీర్‌లో ఒక బిగ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.
జూనైద్ కుమార్ - అభే అందించిన సంగీతం ఆలయ గంటల ప్రతిధ్వనిలా వినసొంపుగా ఉంది. పాటలోని స్వరాలు ఒక మంత్రంలా విజువల్స్ ద్వారా ప్రవహిస్తూ, వినేవారికి ఎంతో ప్రశాంతతను , ఆధ్యాత్మిక భావనను కలిగిస్తున్నాయి. సంగీతంలో వినిపిస్తున్న ఆ గాంభీర్యం, విజువలైజేషన్ చూస్తుంటే సినిమా స్థాయిని చాటిచెబుతోంది.
ఈ పాటలోని కొరియోగ్రఫీ క్లాసికల్ బ్యూటీకి ప్రతిరూపంగా నిలిచింది. నభా నటేష్, దక్ష నగర్కర్ తమ నృత్యంతో భక్తి- ఆధ్యాత్మకితను ప్రతిబింబించారు. వందలాది మంది డ్యాన్సర్ల మధ్య వారి కదలికలు ఒక సముద్రపు అలల ప్రార్థనలా అనిపిస్తున్నాయి. ఆర్ట్ డైరెక్షన్ ప్రతి ఫ్రేమ్‌ను ఒక పవిత్రమైన పెయింటింగ్‌లా మార్చింది.
దర్శకుడు అభిషేక్ నామా భారీ సెట్లు, అద్భుతమైన కాస్ట్యూమ్స్, గ్లింప్స్‌తో సంజయ్ లీలా భన్సాలీ స్థాయి మేకింగ్‌ను గుర్తుచేస్తున్నారు. టాలీవుడ్ తెరపై మరో క్లాసిక్‌ను ఆవిష్కరిస్తున్నారా? అన్నంత రేంజ్‌లో ఈ ప్రోమో కంటెంట్ ఉంది. విజువల్స్ అన్నీ అత్యున్నత ప్రమాణాలతో కూడి ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ప్రోమో ఒక విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తూ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పూర్తి పాట మార్చి 15న ఉదయం 11:11 గంటలకు విడుదల కానుంది. ఆధ్యాత్మిక ఎపిక్ గా సిద్ధమవుతున్న `నాగబంధం` ప్రతి మూలలో ప్రతిధ్వనించడం ఖాయమనిపిస్తోంది. ఆధ్యాత్మికత , కళాత్మకత కలగలిసిన ఈ అద్భుతాన్ని వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.