పవన్ 'ఉస్తాద్'.. టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ హవా మొదలవ్వడానికి ఇంకా వారం రోజులే సమయం ఉంది.;

Update: 2026-03-12 17:43 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ హవా మొదలవ్వడానికి ఇంకా వారం రోజులే సమయం ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అధికారికంగా అనుమతినిచ్చింది. దీంతో మెగా అభిమానులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికెట్ అందుకుంది. సినిమా నిడివి, కంటెంట్ పట్ల బోర్డు సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయడంతో మేకర్స్ ఇప్పుడు రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల వివరాలు చూస్తే.. బెనిఫిట్ షోల కోసం రూ. 500గా నిర్ణయించారు. ఇక రెగ్యులర్ షోల విషయానికి వస్తే, సింగిల్ స్క్రీన్స్‌లో పాత ధరలకు అదనంగా రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా బడ్జెట్ పవన్ కళ్యాణ్ మార్కెట్ రేంజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఉదయం 4 లేదా 5 గంటలకే షోలు మొదలవ్వబోతుండటంతో థియేటర్ల వద్ద సందడి నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ మేకర్స్ ఎటువంటి టికెట్ రేట్ల పెంపును కోరలేదు. ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ ధరలకే టికెట్లు విక్రయించనున్నారు. అలాగే మార్చి 18న ఎటువంటి ప్రీమియర్ షోలు ఉండవని, నేరుగా 19వ తేదీ ఉదయం 7 గంటల నుండి షోలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు వ్యూహాలతో ముందుకెళ్తుండటం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూనే, తెలంగాణలో సాధారణ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ప్లాన్ చేశారు.

ఈ టికెట్ రేట్ల పెంపు వల్ల సినిమా వసూళ్లపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా తనదైన శైలిలో డైలాగులు పేలుస్తుంటే చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన కాలర్ సాంగ్ మాస్ ఆడియన్స్‌లో పూనకాలు తెప్పిస్తుండగా, ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటు నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చింది.

ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు సర్వం సిద్ధమైంది. ఏపీలో తెల్లవారుజాము నుండే థియేటర్ల వద్ద హంగామా మొదలవ్వబోతోంది. ప్రభుత్వం సపోర్ట్ కూడా తోడవ్వడంతో సినిమా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉండేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News