అక్కడ రాణించాలంటే అహం పక్కన పెట్టాలి!
ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు గ్లోబల్ సినిమా వేదికపై ముద్ర వేయడం పెరిగింది.
ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు గ్లోబల్ సినిమా వేదికపై ముద్ర వేయడం పెరిగింది. బాలీవుడ్‌తో పాటు ప్రాంతీయ సినిమాల్లో రాణించిన నటులు హాలీవుడ్ ప్రాజెక్టులలో కీలక పాత్రలు పోషిస్తూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో `మీర్జాపూర్`,`విక్టోరియా అండ్ అబ్దుల్`, `డెత్ ఆన్ ది నైల్`, `కందహార్` వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించిన భారతీయ నటుడు అలీ ఫజల్ అంతర్జాతీయ వేదికలపై స్థిరపడటం వెనుక ఉన్న రహస్యాలను ..తన అనుభవాలను పంచుకున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమకు- హాలీవుడ్‌కు మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసాలలో కాస్టింగ్ ప్రక్రియ ఒకటని అలీ ఫజల్ పేర్కొన్నారు. భారతదేశంలో ఒకసారి గుర్తింపు వచ్చిన తర్వాత నటులకు నేరుగా అవకాశాలు రావడం సాధారణం. కానీ హాలీవుడ్‌లో ఎంతటి స్టార్ డమ్ ఉన్నా సరే? ఆడిషన్స్ ఇవ్వడం అనేది తప్పనిసరి. అక్కడ మనుగడ సాగించాలంటే ఆడిషన్స్ ఇవ్వడానికి వెనుకాడకూడదు. సిగ్గుపడకుండా ప్రతి అవకాశాన్ని ఒక పరీక్షగా భావించి ముందుకు వెళ్లాలని కొత్తగా అంతర్జాతీయ అవకాశాల కోసం ప్రయత్నించే నటులకు సూచించారు.
స్వదేశంలో మంచి పేరు.. క్రేజ్ ఉన్న చాలా మంది నటులు హాలీవుడ్‌లో ఆడిషన్స్ ఇవ్వడానికి కొంత సంకోచిస్తుంటారు. తమను తాము మళ్లీ నిరూపించుకోవాలా? అనే అహం వారిలో ఉండొచ్చని అయితే అంతర్జాతీయ రంగంలో రాణించాలంటే ఆ అహాన్ని పక్కన పెట్టడం చాలా అవసరమని అలీ ఫజల్ అభి ప్రాయపడ్డారు. ఆడిషన్స్ అనేవి కేవలం ఒక నటుడి ప్రతిభను పరీక్షించేవి మాత్రమే కాదని.. సదరు పాత్రకు ఆ నటుడి బాడీ లాంగ్వేజ్.. లుక్ ఎంత వరకు సరిపోతాయో? దర్శకులకు తెలియజేసే ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అని విశ్లేషించారు.
హాలీవుడ్ లాంటి అత్యంత పోటీ ఉన్న పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది అంత సులభం కాదన్నారు. దానికి ఎంతో ఓపిక, పట్టుదల అవసరమని అలీ వివరించారు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత కూడా తిరస్కరణలు ఎదురవుతాయని, వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా కెరీర్‌లో ఒక భాగంగా అంగీకరించాలన్నారు. ఒక ప్రాజెక్ట్ చేజారినా? తదుపరి ఆడిషన్ కోసం మరింత మెరుగ్గా సిద్ధం కావడమే హాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం కొనసాగడానికి ఏకైక మార్గమని స్వీయా అనుభవాల ఆధారంగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో అంతర్జాతీయ కాస్టింగ్ ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు. సెల్ఫ్-టేప్స్ , వర్చువల్ ఆడిషన్స్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా హాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించవచ్చని అలీ ఫజల్ తెలిపారు. అయితే గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా మన నటనను మలచుకోవడం, విభిన్న యాసలపై పట్టు సాధించడం , కథను అర్థం చేసుకునే విధానాన్ని మెరుగుపరుచుకోవడం ముఖ్యమన్నారు. మన ప్రత్యేకతను కోల్పోకుండానే అంతర్జాతీయ మేకర్స్ ఆశించే వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు.
అలీ ఫజల్ హాలీవుడ్ ప్రయాణం అంతర్జాతీయ సినిమా వైపు అడుగులు వేయాలనుకునే భారతీయ నటీనటులకు అద్భుతమైన రోడ్ మ్యాప్‌గా నిలుస్తుంది. స్టార్ హోదా కంటే నటన పట్ల అంకితభావం, నిరంతరం నేర్చుకునే తత్వం , పరిశ్రమ పద్ధతులకు అనుగుణంగా మారడమే గ్లోబల్ వేదికలపై విజయానికి సూత్రాలని ఆయన మాటలు నిరూపిస్తున్నాయి.