భ‌ర్త మాట‌కు ఎంత‌ విలువ ఇవ్వాలి? సామ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ఇంట్లోనే ఒక అద్భుతమైన కథకుడు లేదా స్టోరీ టెల్లర్ భర్తగా ఉండటం వృత్తిపరంగా ఎంతవరకు సహాయపడుతుందనే ప్రశ్నకు సమంత చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

Update: 2026-06-18 09:21 GMT

సమంత రూత్ ప్రభు.. కెరీర్, వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ద‌క్షిణాది స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్ధంన్న‌ర కాలంగా ఎదురే లేకుండా హ‌వా సాగిస్తున్న న‌టి. దర్శక‌నిర్మాత‌ రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మ‌రింత వైబ్రేంట్ గా తీర్చిదిద్దుకుంటున్న తీరు స్ఫూర్తిని నింపుతోంది. ఈ జంట మ‌ధ్య అన్యోన్య‌త గురించి ఇటీవ‌ల చ‌ర్చ సాగుతోంది. సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారా ఒకరిపై ఒకరు తమకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో సమంత తన భర్త రాజ్ నిడిమోరు గురించి... తన జీవితంలో ఆయన చూపిస్తున్న ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేయడం వంటి చిన్న చిన్న విషయాల్లో కూడా తన భర్త నిర్ణయం ఎంత ముఖ్యమో సామ్ వివరించారు.

ఇంట్లోనే ఒక అద్భుతమైన కథకుడు లేదా స్టోరీ టెల్లర్ భర్తగా ఉండటం వృత్తిపరంగా ఎంతవరకు సహాయపడుతుందనే ప్రశ్నకు సమంత చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు.తన వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య ఒక స్పష్టమైన సరిహద్దును గీశారు. ``నా వ్యక్తిగత జీవితం వేరు, నా వృత్తిపరమైన జీవితం వేరు`` అని సామ్ పేర్కొన్నారు. అయితే అదే సమయంలో తమ జీవితంలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా ఇద్దరి ఉమ్మడి నిర్ణయమేనని సమంత స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న బంధం.. ఒకరినొకరు గౌరవించుకునే విధానం ఎంత బలంగా ఉందో త‌న‌ మాటలను బట్టి అర్థమవుతోంది.

తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ... తమ ఉమ్మడి నిర్ణయాల పరిధి ఎంతవరకు ఉంటుందో మరింత స్పష్టతనిచ్చారు. ``నేను 99 శాతం నా భర్త మాటనే వింటాను`` అని ఆమె సగర్వంగా ప్రకటించారు. చివరకు ఇన్‌స్టాలో ఒక సాధారణ పోస్ట్ పెట్టాలన్నా కూడా మొదట తన భర్తతోనే చర్చిస్తానని, ఆయన అభిప్రాయాన్ని (బౌన్స్ ఆఫ్) తీసుకుంటానని చెప్పారు. అంతలా రాజ్ నిడిమోరు తన జీవితంలోని ప్రతి అడుగులోనూ, చిన్న చిన్న విషయాలలోనూ భాగస్వామిగా ఉన్నారని సమంత సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఇంటర్వ్యూలో కేవలం తన వ్యక్తిగత విషయాలకే పరిమితం కాకుండా... సమాజంలో మహిళలపై ఉన్న కొన్ని రుగ్మతల గురించి కూడా సమంత గళమెత్తారు. ముఖ్యంగా సమాజం ఒక స్త్రీని ఆమెకు ఉన్న వంట నైపుణ్యాల (కుకింగ్ స్కిల్స్) ఆధారంగా ఎలా జడ్జ్ చేస్తుందో... తక్కువ చేసి మాట్లాడుతుందో ప్రస్తావించారు. కేవలం వంట చేయడం రాకపోతేనో లేదా అందులో నైపుణ్యం లేకపోతేనో ఆ మహిళ సమాజంలో తక్కువ విలువ కలిగినదిగా భావించేలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమాజం మార్చుకోవాల్సిన ఇటువంటి కొన్ని సున్నితమైన అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా షేర్ చేసారు.

సమంత -రాజ్ నిడిమోరుల వైవాహిక జీవితం పరస్పర గౌరవం, నమ్మకం... ప్రతి విషయంలోనూ భాగస్వామ్యంతో ఎంతో ఆదర్శవంతంగా సాగుతోందని ఈ ఇంటర్వ్యూ క్లారిటీనిచ్చింది. వృత్తిపరంగా ఎవరి రంగాల్లో వారు బిజీగా ఉన్నా.. ఒకరికొకరు తోడుగా నిలుస్తూ జీవితాన్ని అందంగా మలచుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా సమంత సమాజంలోని మహిళల సమస్యలపై స్పందిస్తూ... తనదైన పరిణతిని ప్రదర్శిస్తుండటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స‌మంత న‌టించిన `మా ఇంటి బంగారం` జూన్ 19న‌ విడుద‌ల కానుంది. ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్ల కోసం తాను ర‌క్తం చిందించాల్సి వ‌చ్చిందని, స్లోమోష‌న్- బిల్డ‌ప్ షాట్స్ తో ప‌ని లేకుండా రియ‌ల్ స్టంట్స్ చేసాన‌ని స‌మంత తెలిపారు. దీనికోసం ర‌క్తం చిందించాన‌ని కూడా వెల్ల‌డించారు.

Tags:    

Similar News