హీరోయిన్ల‌కు బ‌హుమ‌తులు అందుకే ఇవ్వ‌రు!

సినిమా భారీ విజ‌యం సాధించిన‌ప్పుడు..ఊహించ‌ని వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ప్పుడు నిర్మాత‌లు..హీరోలు దర్శకులకు ఖరీదైన కార్లు, ప్లాట్లు , ఇతర విలాసవంతమైన బహుమతులు ఇవ్వడం తరచూ చూస్తుంటాం.

Update: 2026-09-13 04:11 GMT

సినిమా భారీ విజ‌యం సాధించిన‌ప్పుడు..ఊహించ‌ని వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ప్పుడు నిర్మాత‌లు..హీరోలు దర్శకులకు ఖరీదైన కార్లు, ప్లాట్లు , ఇతర విలాసవంతమైన బహుమతులు ఇవ్వడం తరచూ చూస్తుంటాం. కొన్ని సంద‌ర్భాల్లో హీరోలే ద‌ర్శ‌కులు సొంత డ‌బ్బుతో కార్లు కొనిస్తుంటారు. ఇది వారిపై అభిమానం చేసే ప‌ని. కానీ ఇదే అభిమానం ఒక హీరోయిన్ పై నిర్మాత‌లు..హీరోలు ఎందుకు చూపించారు? కార్లు? ప్లాట్లు? ఖ‌రీదైన బ‌హుమ‌తులు వారికి ఎందుకు ఇవ్వ‌రు? అలాంటి వాటిని అందుకునే అర్హ‌త వారికి లేదా? ఇలా అనేక‌ సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే అందుకు చాలా కార‌ణాలే ఉన్నాయి.

పారితోషికం, బాధ్యతల విషయంలో హీరోలు, దర్శకులతో పోలిస్తే హీరోయిన్ల వ్యవహారశైలి భిన్నంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. పారితోషికం విషయంలో హీరోయిన్లు ఏమాత్రం వెనక్కి తగ్గరు. సినిమా నిర్మాణంలో ఆలస్యం జరిగినా లేదా బడ్జెట్ సమస్యలు తలెత్తినా తమకు రావలసిన రెమ్యునరేషన్ విషయంలో కచ్చితంగా ఉంటారు. షూటింగ్ పూర్తయ్యేలోపు లేదా డబ్బింగ్ చెప్పే ముందే చివరి రూపాయి వరకు ముక్కు పిండి మరీ వసూలు చేస్తారనే ప్రచారం ఉంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకోవడానికే వారు ప్రాధాన్యత ఇస్తారు.

ఆ విష‌యంలో ఎంత మాత్రం రాజీ ప‌డ‌రు. అద‌నంగా కాల్షీట్లు కేటాయించే ప‌రిస్థితి కూడా ఉండ‌దు. వారు చెప్పిన డేట్ల‌లోనే షూటింగ్ చేసుకోవాలి. లేదంటే? కాల్షీట్ల‌ను మ‌ళ్లీ స‌ర్దుబాటు చేయాలంటే అద‌నంగా పైకం చెల్లిం చాల్సిందే. అలాగే హీరోయిన్లు సినిమా ప్ర‌మోష‌న్ కు హాజ‌ర‌వ్వాలంటే స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించాలి. వారితో పాటు వారి వెంట వ‌చ్చే అద‌న‌పు సిబ్బంది ఖ‌ర్చులు నిర్మాతే భ‌రించాలి. మ‌రికొంత మందైతే? ప్ర‌చారం కోసం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే హీరోలు, దర్శకుల విషయంలో పరిస్థితి అలా ఉండదు. సినిమా డిజాస్టర్ అయితే చాలా మంది స్టార్ హీరోలు పారితోషికం తిరిగిచ్చేస్తారు. లేదా త‌ర్వాత ప్రాజెక్ట్ లో బ్యాలెన్స్ చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. అలాగే దర్శ కులు కూడా పారితోషికంలో కొంత భాగాన్ని నిర్మాతకు తిరిగి ఇవ్వడం లేదా తదుపరి సినిమాను తక్కువ పారితోషికంతో చేయ‌డం వంటిని జ‌రుగుతుంటాయి. నిర్మాత ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ద‌ర్శ‌క‌, హీరోలు ఈ ర‌క‌మైన సర్దుబాటు చేస్తుంటారు. అంతే కాదు సినిమా ఫలితానికి దర్శకుడు, హీరోలు పూర్తి బాధ్యత వహిస్తారు. సినిమా స్క్రిప్ట్ దశ నుండి విడుదల వరకు ప్రచార బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకుంటారు.

సినిమా ఫ్లాప్ అయితే విమర్శలను నేరుగా ఎదుర్కొనేది కూడా వారే. కానీ హీరోయిన్ల పాత్ర పరిమితంగా ఉండటం వల్ల సినిమా పరాజయానికి వారు బాధ్యత వహించాల్సిన అవసరం రాదు. ఇది కూడా వారి ఆలోచనా విధానంలో వ్యత్యాసానికి ఓ కారణం. హీరోయిన్లు సినిమా పై బాధ్యత తీసుకోవ‌డం అనేది పాత్ర వరకే ప‌రిమితం చేస్తారు. నిర్మాతలు కూడా వారితో వ్యాపారపరమైన సంబంధానికే పరిమితమవుతారు. సినిమా విడుదలైన తర్వాత వారికి వచ్చే లాభాల్లో హీరోయిన్లకు వాటా ఇవ్వకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం. పనికి తగ్గ ప్రతిఫలం వెంటనే తీసుకుంటారు కాబట్టి ప్రత్యేకమైన బహుమతులకు, ప్యాకేజీల‌కు తావుండదు.

హీరోయిన్ల కెరీర్ స్ప్యాన్ తక్కువగా ఉండటం వల్ల కూడా వారు ఆర్థిక భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వచ్చే అవకాశాలను, పారితోషికాన్ని కచ్చితత్వంతో వాడుకుంటారు. ఏది ఏమైనా? బాధ్యతను స్వీకరించే విషయంలో ఉండే వ్యత్యాసమే నిర్మాతలు హీరోలు, దర్శకులకు ఇచ్చే ప్రాధాన్యతకు- హీరోయిన్లకు ఇచ్చే బహుమతులకు మధ్య ఉన్న ప్రధాన తేడాగా చెప్పొచ్చు.

Tags:    

Similar News