వీరమల్లు.. బిజినెస్ సంగతేంటి?

ఈ సమయంలో డీల్స్ ఫైనల్ చేయకపోతే ఆఖరి నిమిషంలో లేనిపోని సమస్యలు వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.;

Update: 2025-07-07 17:17 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత కొంత కాలంగా వాయిదాలు పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు ఇక చివరి దశకు చేరింది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్ తర్వాత బజ్ బాగానే పెరిగింది. పవన్ లుక్, గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ గురించి టాక్ జరుగుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం నిర్మాత ఏఎం రత్నం ఏపీ-తెలంగాణ కలిపి సుమారు 140 కోట్లకు పైగా బిజినెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పూర్తిగా డీల్స్ క్లోజ్ కాలేదట. ముఖ్యంగా నైజాం డీల్ ధర 65 కోట్ల వరకు పలుకుతుందని టాక్. కానీ ఇంకా సీడెడ్, ఆంధ్రా, కర్ణాటక ఏరియాల డీల్స్ తుది దశ చర్చల్లోనే ఉన్నట్టు సమాచారం.

సినిమా విడుదలకు మరో పదిహేను రోజులు మాత్రమే ఉండటంతో బయ్యర్లు ఒత్తిడి పెడుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ సమయంలో డీల్స్ ఫైనల్ చేయకపోతే ఆఖరి నిమిషంలో లేనిపోని సమస్యలు వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. బెనిఫిట్ షోలు ఎప్పటి నుంచి వేయాలన్నదీ ఇంకా ఫిక్స్ కాలేదు. వీటిపై త్వరగా నిర్ణయాలు తీసుకోకపోతే ప్రీ రిలీజ్ మూడ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇవన్నీ పక్కన పెట్టినా హరిహర వీరమల్లుకి మంచి ఓపెనింగ్ దక్కడం మాత్రం ఖాయం. రీసెంట్‌గా వచ్చిన పెద్ద సినిమాల్లో సరైన హైప్ లేకపోవడంతో బాక్సాఫీస్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఈ సమయంలో మాస్ ప్రేక్షకులు మళ్లీ థియేటర్‌కి వచ్చేలా చేసే పవర్ ఈ సినిమాకే ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్నా, థియేటర్‌లో ఈ సినిమాతో తన స్టామినాను మళ్లీ నిరూపించే అవకాశం ఉంది.

మొత్తానికి, బిజినెస్ పరంగా ఇంకా కొన్ని విషయాలు తేలాల్సినప్పటికీ, సినిమా కంటెంట్‌పై, మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ట్రైలర్‌లో చూపిన విసువల్స్, బ్యాక్‌డ్రాప్ సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. ఓసారి పాజిటివ్ టాక్ వచ్చినట్లైతే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రన్ ఇవ్వడమే కాకుండా, కొత్త రికార్డుల కోసం దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇక మిగతా డీల్స్ ఎప్పటి వరకు ఖరారవుతాయో చూడాలి.

Tags:    

Similar News