అత‌డు టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడా?

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు శౌబిన్ షాహిర్.;

Update: 2026-03-17 23:30 GMT

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు శౌబిన్ షాహిర్. `ప్రేమమ్`, `కుంబలంగి నైట్స్`, `మంజుమ్మ‌ల్ బాయ్స్` ,`కూలీ` వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచిత‌మే. ప్ర‌త్యేకించి `కూలీ`లో పాత్ర స‌హా మోనిక పాట‌తో పాన్ ఇండియాలో సంచ‌ల‌నం అయ్యాడు. ఒక్క పాట అత‌డికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. అప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో సినిమాల్లో న‌టించాడు. కానీ ఏ సినిమా తీసుకురాని ఐడెంటిటీ `కూలీ` చిత్రం త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో తెచ్చి పెట్టింది. తాజాగా ఈ న‌యా స్టార్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళ్తే మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో

ఓ భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శౌబిన్ ఓ కీల‌క పాత్ర‌తో అడుగుపెడుతున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆయన కేవలం ఒక సాధారణ పాత్రలో కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని వార్త‌లొస్తున్నాయి. సంకల్ప్ రెడ్డి సినిమాల్లో పాత్రలు ఎంత బ‌లంగా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. కేవ‌లం హీరో పాత్ర‌ను మాత్ర‌మే హైలైట్ చేయ‌డు. పాత్ర‌లో బ‌లాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. అత‌డి సినిమాల్లో ఎంపిక‌య్యే న‌టులు కూడా యూనిక్ గా ఉంటారు. రెంగ్యుల‌ర్ న‌టుల్ని తీసుకోడు.

పాత్ర‌కు ప‌ర్పెక్ట్ గా సూట‌య్యే వారినే ఎంపిక చేస్తాడు. ఈనేప‌థ్యంలోనే ఓ రోల్ కి శౌబిన్ అనే ప్రతిభావంతుడిని ఎంచుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇక శౌబిన్ విష‌యానికి వ‌స్తే? శౌబిన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ప్రతిభను చాటుకున్నాడు. అత‌డి నటనలో ఒక సహజత్వం ఉంటుంది. సీరియస్ రోల్స్ అయినా? కామెడీ అయినా? తనదైన శైలిలో పండించగలడు. గోపీచంద్ సినిమాలో ఆయన పోషించబోయే పాత్ర నెగటివ్ షేడ్స్ కలిగి ఉంటుందా? కథానాయకుడికి అండగా నిలిచే పాత్రలో కనిపిస్తాడా అన్నది క్లారిటీ రావాలి.

ఏది ఏమైనా ఒక బలమైన నటుడు తెలుగు తెరపైకి రావడం ఆస‌క్తిక‌రం. నాలుగైదేళ్ల కాలంగా మలయాళ నటులకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. ఫహద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్ బాటలోనే శౌబిన్ కూడా తెలుగులో తన ముద్ర వేస్తాడ‌ని విశ్లేషకులు భావిస్తున్నారు. మ‌రి సంకల్ప్ రెడ్డి విజన్ - గోపీచంద్ మాస్ ఇమేజ్ కు తోడు శౌబిన్ షాహిర్ నిజంగా తోడైతే ఎలాంటి మ్యాజిక్ జరుగుతంద‌న్న‌ది చూడాలి. ఈ సినిమా త‌ర్వాత‌ శౌబిన్‌కు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా చెప్పొచ్చు.

Tags:    

Similar News