అల్లు వారసుడు శిరీష్ సెకెండ్ ఇన్నింగ్స్!
నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీస్ సినీ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు.;
నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీస్ సినీ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. `గౌరవం` నుంచి `బడ్డీ` వరకు చేసిన ప్రయత్నాలేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం కాలేదు. 13-15 ఏళ్ల నట ప్రయాణంలో నటుడిగా అతడు పెద్దగా సాధించింది ఏదీ లేదు. అయితే ఇకపై శిరీష్ జర్నీ ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరం. నైనికా రెడ్డితో శిరీష్ వివాహం జరగడంతో సెకండ్ ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టాడు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే..శిరీష్ `శ్రీరస్తు శుభమస్తు`, `ఒక్క క్షణం`, `ఊర్వశివో రాక్షసివో` వంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది.
కానీ సక్సెస్ రేసులో మాత్రం వేల మైళ్ల దూరంలోనే ఉన్నాడు. ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. హీరో పాత్రలకే పరిమితం కాకుండా ఓ సినిమాలో కీలక పాత్రల్లోనూ మెప్పించాడు. కానీ ఆ పాత్రల్ని తదుపరి కొనసాగించలేదు. ప్రస్తుతం `మగజాతి ఆణిముత్యం` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాతో శిరీష్ జాతకం కూడా మారాల్సిందే. అంతే కాదు వివాహం కూడా కొందరికి కలిసొస్తుంది. కొన్ని రకాల బాధ్యతల్ని కూడా పెంచుతుంది. మరి నైనికతో వివాహం శిరీష్ లో ఏ రకమైన మార్పులు తెచ్చిందో.
పెళ్లి తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాత్రం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. `గతంలో ఒంటరిగా ఉన్నప్పుడు సంపాదనపై పెద్దగా ఒత్తిడి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక కుటుంబానికి బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది. అందుకే కెరీర్ పట్ల నాలో కసి, ఆశయం మరింత పెరిగాయన్నాడు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే శిరీష్ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకోబోతున్నారని అర్థమవుతోంది. మరోవైపు శిరీష్ కేవలం కెమెరా ముందుకే పరిమితం అవుతారా? లేక తన తండ్రి అల్లు అరవింద్‌లా నిర్మాణ రంగంలోకి అడుగు పెడతారా? అన్న చర్చ కూడా జరుగుతోంది.
`గీతా ఆర్ట్స్`, `ఆహా` ఓటీటీ తాజాగా ప్రారంభించిన `అల్లు సినిమాస్` వంటి భారీ వ్యాపార సామ్రాజ్యం ఉండటంతో, భవిష్యత్తులో శిరీష్ నిర్మాణ లేదా వ్యాపార బాధ్యతలను స్వీకరించే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో ఆయన సరదాగా చేసిన `నేను రిటైర్ అయిపోయిన వాణ్ణి` అన్న వ్యాఖ్యల్లో సీరియస్ నెస్ ఎంతో తెలియాలి. ఇప్పటికే తాతయ్య రామానాయుడు, తండ్రి సురేష్ బాబు వారసత్వాన్ని నిర్మాతగా రానా కొనసాగిస్తున్నాడు. అలా శిరీష్ అరవింద్ వారసత్వంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి.