కొత్త వారితో క్లాసిక్ డైరెక్టర్ల ప్రయోగాలు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసిన ప్రముఖ దర్శకులంతా ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకొస్తున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసిన ప్రముఖ దర్శకులంతా ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకొస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తోన్న మార్పులను గమనించి పాత వైభవాన్ని తిరిగి సాధించడానికి స్టార్ మేకర్స్ గట్టి పట్టుదలతో ఉన్నారు. వరుస పరాజయాలతో కొంతకాలంగా వెనుకబడ్డ వారంతా? స్టార్ హీరోల కోసం ఎదురు చూడకుండా పూర్తిగా కొత్త నటీనటులతో ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కోవలో ముందుగా వినిపిస్తున్న పేరు సృజనాత్మకతకు మారుపేరైన కృష్ణవంశీ.
ఎన్నో క్లాసిక్ - మాస్ సినిమాలను అందించిన కృష్ణవంశీ తనదైన శైలికి పదును పెడుతూ సరికొత్త కథతో యంగ్ టాలెంట్‌ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద హీరోల డేట్ల కోసం నిరీక్షించే బదులు కథ డిమాండ్ చేసిన మేరకు కొత్త కుర్రాళ్లతో సినిమా చేస్తేనే ఫలితం అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే విభిన్న కథాంశాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రిష్ జాగర్లమూడి కూడా ఇదే బాట పట్టారు. చారిత్రక - ప్రయోగాత్మక చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఇటీవల కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తనదైన మార్క్ కంటెంట్‌ను కోల్పోకుండా పూర్తిగా ఫ్రెష్ ఫేస్‌లతో సరికొత్త రియాలిస్టిక్ డ్రామాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శేఖర్ కమ్ముల పరిస్థితి కూడా ఆసక్తికరంగా ఉంది. ఎప్పుడూ సహజమైన భావోద్వేగాలతో కూడిన చిత్రాలను తెరకెక్కించే క్లాసిక్ డైరెక్టర్ కొత్త నటీనటులకు అవకాశాలు ఇస్తూనే బ్లాక్‌బస్టర్లు అందుకోవడం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం శేఖర్ ప్లాన్ చేస్తున్న తదుపరి ప్రాజెక్ట్‌లోనూ యువ నటులకే పెద్దపీట వేస్తున్నారుట. తన మార్క్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి శ్రమిస్తున్నారు. `బొమ్మరిల్లు` వంటి క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు భాస్కర్ కూడా రీసెంట్ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేందుకు సరికొత్త ప్లాన్ వేసుకున్నారు.
వీరంతా భారీ అంచనాల ఒత్తిడి లేకుండా యువతను ఆకట్టుకునే కథాంశంతో కొత్తవారితో సినిమా చేయాలని బలంగతా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. స్టార్ హీరోల ఇమేజ్ హంగులతో పనిలేకుండా కథే నమ్ముకుని ముందుకు వెళ్లాలనే దర్శకుల నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ మేకర్స్ అంతా పాత ఫ్లాప్‌ల రికార్డులను పక్కనపెట్టి కొత్త నటీనటులతో ప్రయోగాత్మక చిత్రాల బాట పట్టడం శుభ పరిణామం. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో చేస్తున్న సాహసోపేత ప్రయత్నాలు సక్సెస్ ట్రాక్ ఎక్కాలని తెలుగు సినిమాకు మళ్లీ అద్భుతమైన క్లాసిక్ రోజులు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.