సూర్యను కాపాడేది మనోడేనా?

దక్షిణాది సినీ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడిగా సూర్యను చెప్పొచ్చు. ‘గజిని’ సినిమాతో తమిళంలో టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగిన సూర్య.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.;

Update: 2026-03-18 02:30 GMT

దక్షిణాది సినీ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడిగా సూర్యను చెప్పొచ్చు. ‘గజిని’ సినిమాతో తమిళంలో టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగిన సూర్య.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఆ తర్వాత ఇక్కడ ఆయన ఫాలోయింగ్ మరింత పెరిగింది. కర్ణాటక, కేరళల్లోనూ ఆయన ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. కానీ గత దశాబ్ద కాలంలో సరైన సినిమాలు చేయక, సక్సెస్ రేట్ బాగా పడిపోయి.. సూర్య మార్కెట్ దెబ్బ తింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కంగువ’ సైతం దారుణంగా దెబ్బ కొట్టడంతో సూర్య ఎన్నడూ లేనంతగా డీలా పడిపోయాడు. దాని తర్వాత వచ్చిన ‘రెట్రో’ కూడా ఆయన కెరీర్‌ను మార్చలేకపోయింది.

ఆపై సూర్య.. ‘కరుప్పు’ అనే మాస్ మూవీ చేశాడు. ఆర్జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకుడు. దర్శకుడిగా పెద్దగా అనుభవం లేని బాలాజీ.. సూర్యకు హిట్టివ్వగలడా అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమా విపరీతంగా ఆలస్యం అవుతోంది. గత ఏడాది దీపావళికి అనుకున్న సినిమా.. వేసవికైనా రిలీజవుతుందో లేదో తెలియట్లేదు. నిర్మాతకు ఏవో సమస్యలు ఉండడం వల్ల ఈ సినిమా విడుదలపై అయోమయానికి దారి తీస్తోంది. ఈ ఆలస్యం వల్ల సినిమా మీద అంచనాలు మరింత తగ్గిపోతున్నాయి.

ఇలాంటి టైంలో సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ లాంచ్ అయింది. నిన్న రిలీజైన ఆ టీజర్.. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. భారీగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి ఈ టీజర్‌కు. సూర్యకు ప్రయోగాలు కొత్త కాదు కానీ.. ఇలాంటి పాత్రలో కనిపించడం మాత్రం కొత్తే. తనతో పోలిస్తే సగం వయసున్న అమ్మాయి తనతో ప్రేమలో పడితే.. ఆమెను హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడే నడి వయస్కుడి పాత్రలో సూర్య జనాలకు చాలా బాగా నచ్చేస్తున్నాడు. మామిత బైజు కూడా అంతే ఆకట్టుకుంటోంది.

‘బ్లాక్ బస్టర్ రిటన్ ఆల్ ఓవర్’ అని కొత్త సినిమాల టీజర్లు, ట్రైలర్లు లాంచ్ అయినపుడు టెంప్లేట్ కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. ఐతే ఈ ఫీలింగ్ చాలామందిలో కలిగిస్తోంది ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్. ఇది కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టే పెద్ద మాస్ హిట్ కాకపోవచ్చు కానీ.. సరైన విజయం లేక సతమతం అవుతున్న సూర్యకు కచ్చితంగా ఉపశమనాన్ని ఇస్తుందని మాత్రం ధీమాగా చెప్పొచ్చు. సార్, లక్కీ భాస్కర్ చిత్రాల తర్వాత మరో పరభాషా కథానాయకుడికి వెంకీ అట్లూరి హిట్ ఇవ్వబోతున్నాడని నమ్మకం పెట్టుకోవచ్చు. ఈ చిత్రం జులైలో విడుదల కానుంది.

Tags:    

Similar News