ఇండియాలో వ‌ర్మ అభిమానించేది వారిద్ద‌రినే!

సంచ‌ల‌న‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. ఆయన ఎవరినీ అంత సులభంగా మెచ్చుకోరు.;

Update: 2026-03-17 19:30 GMT

సంచ‌ల‌న‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. ఆయన ఎవరినీ అంత సులభంగా మెచ్చుకోరు. ఎవరికీ సలహాలు ఇవ్వరు. ముఖ్యంగా తన వద్ద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లకు గానీ, కొత్తగా వచ్చే దర్శకులకు గానీ ఫలానా దర్శకుడి వద్ద చేరి పని నేర్చుకోండి అని వర్మ గత ముప్పై ఏళ్లలో ఎవరికీ సూచించలేదు. కానీ తాజాగా వర్మ పంథా మార్చుకున్నారు. ఇండియాలో తను ప్రస్తుతం ఇద్దరు దర్శకులను మాత్రమే అత్యున్నతంగా అభిమానిస్తున్నానని, దర్శకులు కావాలనుకునే వారు వారిద్దరి వద్దే శిష్యరికం చేయాలని వర్మ బలంగా చెబుతున్నారు.

ఆ ఇద్దరు మరెవరో కాదు. `అర్జున్ రెడ్డి`, `యానిమల్` చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్`, ధురంధ‌ర్ లాంటి భారీ విజ‌యాలు అందించిన‌ ఆదిత్య ధర్. ఈ ఇద్దరి మేకింగ్ స్టైల్, వారి విజన్ చూసి వర్మ ఫిదా అయిపోయారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్ అని దాన్ని వెండితెరపై ఎలా ఆవిష్కరించాలో? వీరిద్దరికీ తెలిసినంతగా మరెవరికీ తెలియదని వర్మ అభిప్రాయపడుతున్నారు. అందుకే కొత్త తరం దర్శకులకు వీరిద్దరి పేర్లను వ‌ర్మ‌ సిఫార్సు చేస్తున్నారు.

వర్మ దృష్టిలో సందీప్ రెడ్డి వంగా ఒక ఒరిజినల్ దర్శకుడు. తను నమ్మిన కథను, పాత్రను ఏమాత్రం రాజీ పడకుండా తెరపై చూపించే ధైర్యం సందీప్ సొంతం. ఆదిత్య ధర్ విషయానికి వస్తే? సాంకేతికంగా సినిమాను ఎంత ఉన్నతంగా తీయవచ్చో `ఉరి` సినిమాతో నిరూపించారు. `ధురంధ‌ర్` క‌థ‌ను ఆదిత్య చెప్పిన తీరుకు వ‌ర్మ ఫిదా అయ్యారు. అలాంటి దర్శకుల వద్ద పని చేస్తే సినిమా పట్ల ఒక స్పష్టమైన అవగాహన వస్తుందన్న‌ది వ‌ర్మ అభి ప్రాయం. వారు అనుసరించే కొత్త తరహా మేకింగ్ విధానం భవిష్యత్తు దర్శకులకు పాఠంలా మారుతుందని వర్మ బ‌లంగా నమ్ముతున్నారు. ఇంకా చెప్పాలంటే? వ‌ర్మ కూడా వాళ్ల ద‌గ్గ‌ర నుంచి నేర్చుకోవాల్సింది ఉన్న‌ట్లే మాట్లాడుతున్నారు.

నిజానికి వర్మ అంటేనే ఒక స్కూల్. ఆయన వద్ద పనిచేసి ఎంతో మంది అసిస్టెంట్లు స్టార్ డైరెక్టర్లుగా ఎదిగారు. ఇప్పుడు వర్మ వాళ్ల‌క‌న్నా? ఎక్కువగా సందీప్, ఆదిత్య‌ పైనే నమ్మకం చూపిస్తున్నారు. `నాకంటే కూడా వారు సినిమాను కొత్త కోణంలో చూస్తున్నారు. వారి ఆలోచనా విధానం అద్భుతం` అని వర్మ బహిరంగంగానే ప్రశంసిస్తున్నారు. ఒక లెజెండరీ దర్శకుడు తన తర్వాతి తరం దర్శకుల గురించి ఇంత గొప్పగా చెప్పడం భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో రాణించాలనుకునే యువతకు వర్మ ఇచ్చిన ఈ సూచన ఒక పెద్ద గైడ్‌లైన్‌లా పని చేస్తుంది. మరి వర్మ అభిమానించే ఇద్ద‌రు ద‌ర్శ‌కులు భవిష్యత్తులో ఇండియన్ సినిమాను ఇంకెన్ని మలుపులు తిప్పుతారో చూడాలి.

Tags:    

Similar News