టాప్ స్టోరీ: వాస్తవ కథలు వదిలేశారు.. దాని ఫలితం!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ప్రముఖ వ్యక్తుల జీవితాలను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు.;

Update: 2026-03-18 03:49 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ప్రముఖ వ్యక్తుల జీవితాలను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా బయోపిక్‌లు వాస్తవాలను పక్కన పెట్టి కేవలం ఒక వర్గాన్ని లేదా వ్యక్తిని సంతృప్తి పరచడానికే పరిమితమవుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించి.. కల్పిత గాథలను జోడించడం వల్ల ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ దురంధ‌ర్ ఫ‌లితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రం ఇందుకు ఒక ఉదాహరణ. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో జయలలిత జీవితాన్ని వ‌న్ సైడెడ్ గా చూపించారనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థి కరుణానిధి పాత్రను తక్కువ చేసి చూపడం ప్రేక్షకులకు రుచించలేదు. నిజాయితీ లేని కథనం కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసిందని త‌మిళ మీడియా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ (కథానాయకుడు, మహానాయకుడు) పరిస్థితి కూడా ఇలాగే ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వ‌భౌమ‌ ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాలను.. ముఖ్యంగా రాజకీయ మలుపులను దర్శకుడు క్రిష్ వాస్తవ విరుద్ధంగా చిత్రీకరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో వాస్త‌వ క‌థ‌ను చెప్ప‌కుండా ద‌ర్శ‌కుడు క్రిష్ వ‌న్ సైడెడ్ గా సినిమాలు తీసార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. బ‌యోపిక్ ఫెయిల్యూర్ కి ప్ర‌ధాన కార‌ణ‌మిదేన‌ని విమ‌ర్శించారు.. లోపాలను కప్పిపుచ్చుతూ కేవలం భజనకే ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రేక్షకులు ఈ చిత్రాలను తిరస్కరించారు. బయోపిక్ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం వాస్తవాలను దాచిపెట్టడమేనని విశ్లేషకులు భావిస్తారు.

కేవలం దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే జీవితం ఆధారంగా వచ్చిన థాకరే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కథతో రూపొందిన `ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్` చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ సినిమాల్లో వాస్తవాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా కనిపించాయని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అనుపమ్ ఖేర్ వంటి హేమాహేమీలు ప్ర‌ధాని పాత్ర‌లో నటించినా సరైన కథనం లేకపోవడంతో ప్రేక్షకులు వీటిని ఆదరించలేద‌ని స్పష్టమవుతోంది.

మరోవైపు.. ఆస‌క్తిక‌రంగా వాస్త‌వ క‌థ‌తో పాటు ఫిక్ష‌న్ అంశాలు జోడించిన దురంధ‌ర్ మాత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది.. ఈ సినిమాలో ప‌లువురు భార‌తీయ స్పై ల క‌థ‌ల్ని జీవితాల‌లో ఘ‌ట‌న‌ల్ని జోడించారు..స్పైల జీవితాల‌ను ఆసక్తికరంగా మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గౌరవం పేరిట వాస్తవాలను దాచిపెట్టడం కంటే.. ఆ సంఘటనల వెనుక ఉన్న భావోద్వేగాలను నిజాయితీగా చూపిస్తేనే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా నిరూపించింది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ గాల్వాన్ లోయ నేపథ్యంలో మన వీర సైనికుల‌ కథను తెరకెక్కిస్తున్నారు. అయితే వాస్త‌వాల‌ను దాచి సైనికుడి క‌థ‌ను కూడా త‌ప్పు దారి ప‌ట్టిస్తున్నారు స‌ల్మాన్ అనే విమర్శ‌లు మొద‌ల‌య్యాయి. చరిత్రను లేదా వీరత్వాన్ని సినిమాటిక్ లిబర్టీ పేరిట తప్పుదోవ పట్టిస్తే ఫలితం ఎలా ఉంటుందో గత సినిమాలు నిరూపించాయి. మరి ఈ గాల్వాన్ కథ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News