మీడియం బ‌డ్జెట్ + మంచి స్టోరీ = లాభాలు గ్యారంటీ!

`బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా స్వ‌రూప‌మే మారిపోయింది. మార్కెట్ స్థాయి కూడా పెర‌గ‌డంతో ఇప్పుడు ప్ర‌తి స్టార్ పాన్ ఇండియా జ‌పం చేస్తున్నాడు.;

Update: 2025-12-29 13:30 GMT

`బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా స్వ‌రూప‌మే మారిపోయింది. మార్కెట్ స్థాయి కూడా పెర‌గ‌డంతో ఇప్పుడు ప్ర‌తి స్టార్ పాన్ ఇండియా జ‌పం చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాల పేరుతో భారీ బ‌డ్జెట్ సినిమాలకు శ్రీ‌కారం చుడుతూ పెద్ద నిర్మాత‌లకు మాత్ర‌మే అందుబాటులో ఉంటున్నారు. దీంతో స్టార్స్ నుంచి సినిమాలు థియేట‌ర్ల‌కు రావ‌డానికి రెండు మూడేళ్ల స‌మ‌యం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తూ కొంత మంది నిర్మాత‌లు అద్భుతాలు సృష్టిస్తున్నారు.

స్టార్స్ లేక‌పోయినా యువ‌తార‌ల‌తో మినిమ‌మ్ బ‌డ్జెట్ సినిమాలు చేస్తూ రికార్డు స్థాయిలో లాభాల్ని ఆర్జిస్తున్నారు. రెండు మూడు కోట్ల బ‌డ్జెట్‌తో యువ‌తార‌తో నిర్మించిన సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తూ స‌రికొత్త సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. గ‌త ఏడాది మీడియం రేంజ్ హీరో కూడా కాని తేజ స‌జ్జ‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ చేసిన మూవీ `హ‌ను మాన్`. కేవ‌లం రూ.40 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో రూ.350 కోట్లు రాబ‌ట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇక ఇదే హీరోతో చేసిన మ‌రో మూవీ `మిరాయ్‌` కూడా రికార్డు స్థాయిలో రూ..140 కోట్లకు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన `కోర్ట్‌`ని కేవ‌లం రూ.4 కోట్ల‌తో నిర్మిస్తే ఏకంగా రూ.57 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి షాక్ ఇచ్చింది. ఇందులో ప్రియ‌ద‌ర్శి, శివాజీ, సాయికుమార్‌, రోహిణి త‌ప్ప పేరున్న ఆర్టిస్ట్‌లు ఎవ‌రూ లేరు. అయినా కంటెంట్ బ‌లంగా ఉండ‌టంతో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది.

మ్యాడ్ కు సీక్వెల్‌గా రూపొందిన `మ్యాడ్‌ స్క్వేర్‌` రూ.4 కోట్ల‌ బ‌డ్జెట్‌తో రూపొంది యూత్ క్రేజ్ కార‌ణంగా రూ.60 కోట్లు రాబ‌ట్టి చిన్న సినిమాల స‌త్తా ఏంటో నిరూపించింది. ఇందులో నార్నే నితిన్‌, రామ్ నితిన్‌, సంగీత్ శోభ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక రూ. 2.5 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన `లిటిల్ హార్ట్స్` ఏకంగా రూ.40 కోట్లు రాబ‌ట్టింది. ఇదే బ‌డ్జెట్‌తో చేసిన `రాజు వెడ్స్ రాంబాయి` రూ.18 కోట్లు క‌లెక్ట్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ న‌టించిన `ఛాంపియ‌న్‌` ఓపెనింగ్స్ ప‌రంగా మంచి బ‌జ్‌ని క్రియేట్ చేసింది. `జాతిర‌త్నాలు` సినిమాతో క్రేజ్‌ని సొంతం చేసుకున్న న‌వీన్ పొలిశెట్టి `అన‌గ‌న‌గ ఒక రాజు` మూవీకి మంచి బ‌జ్ వినిపిస్తోంది.

ఇలా స్టార్ హీరోలు బిజీగా ఉన్న స‌మ‌యంలో నిర్మాత‌ల‌కు యంగ్ స్టార్స్ వ‌రంగా మారి లాభాల వ‌ర్షం కురిపిస్తూ మ‌రిన్ని కొత్త సినిమాల‌కు ఊతం ఇస్తుండ‌టంతో చాలా వ‌ర‌కు నిర్మాత‌లు చిన్న హీరోల‌తో కంటెంట్ బేస్డ్ మూవీస్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలో మునుపెన్న‌డూ లేని సంద‌డి క‌నిపిస్తోంది. పెద్ద సినిమాలు రిలీజ్ కు స‌మ‌యం ప‌డుతున్న వేళ చిన్న సినిమాలు థియేట‌ర్ల‌కు ఫీడింగ్‌గా మారి నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తుండ‌టం విశేషం.

Tags:    

Similar News