'ఫౌజీ'లో క్లైమాక్స్ గుండె బ‌రువెక్కించేలా!

హను రాఘవపూడి సినిమాల్లో ప్రేమ కేవలం రెండు పాత్రల మధ్య ఆకర్షణకే ప‌రిమితం కాదు. ఆ ప్రేమ‌ను అంద మైన కావ్యంలా మ‌ల‌చ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌.;

Update: 2026-03-12 00:30 GMT

హను రాఘవపూడి సినిమాల్లో ప్రేమ కేవలం రెండు పాత్రల మధ్య ఆకర్షణకే ప‌రిమితం కాదు. ఆ ప్రేమ‌ను అంద మైన కావ్యంలా మ‌ల‌చ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. ప్రేమ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌కెక్కించిన సినిమాల్లో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ఎంతో చక్క‌గా తీర్చి దిద్దాడు అన్న‌ది కాద‌న‌లేని నిజం. `అందాల రాక్ష‌సి`లో మిథున పాత్ర గానీ, `సీతారామం`లో సీత పాత్ర మ‌రుపురాని రోల్స్ గా చెప్పొచ్చు. అంత‌కు మించిన బ‌ల‌మైన ప్రేమ‌తో కూడిన‌ప ఎమోష‌న్ ని `ఫౌజీ`లో హీరోయిన్ పాత్ర కోణంలో హైలైట్ చేస్తున్నాడు. `ఫౌజీ` 1940ల నాటి యుద్ధ నేపథ్యాన్ని ఎంచుకున్నా? ఆ వినాశనం మధ్య చిగురించే ఒక సున్నితమైన ప్రేమను చూపించబోతున్నారు.

యుద్ధం చేసే సైనికుడి మనసులో ఉండే మమకారాన్ని, ఆ ప్రేమ కోసం అతను చేసే పోరాటాన్ని హను తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. సినిమాలో ప్రేమకథకు యుద్ధం అనేది ఓ అడ్డంకిలా కాకుండా, ఆ ప్రేమ గాఢతను పెంచే ఒక సాధనంగా మారుతుందని సమాచారం. సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న ఇమాన్వీ పాత్రను హను రాఘవపూడి శక్తివంతంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు. హీరో హీరోయిన్ల మధ్య నడిచే మూగ భాష, క్యూట్ లుక్స్, ఘాఢమైన సంభాషణలు ప్రేక్షకులను ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్తాయ‌ని లీకులందుతున్నాయి.

అందుకే ప్రేమ నేప‌థ్యంలో సాగే సినిమాల్లో హను రాఘవపూడిని మాస్టర్ గా భావిస్తుంటారు. భావోద్వేగాలను దృశ్యరూపంలో చూపించే విధానం అద్భుతంగా ఉంటుంది. `ఫౌజీ` లో కేవలం డైలాగుల‌తోనే కాకుండా, సంగీతం విజువల్స్ ద్వారా ప్రేమను పండించబోతున్నారు. ముఖ్యంగా యుద్ధ భూమిలో ఉండే ఉద్వేగభరితమైన వాతావరణానికి, ప్రేమికుల మధ్య ఉండే ప్రశాంతమైన అనుబంధానికి మధ్య ఉండే వైరుధ్యాన్ని హను చాలా క్లాస్‌గా చూపిస్తున్నాడ‌ని స‌మాచారం. కేవలం ఒక యాక్షన్ సినిమాగా కాకుండా, ఒక ఎపిక్ లవ్ స్టోరీ గా మిగిలిపోయేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడ‌ని తొలి నుంచి వినిపిస్తూనే ఉంది.

వాస్త‌వానికి ప్రభాస్ లాంటి భారీ కటౌట్ తో పోయెటిక్ లవ్ స్టోరీ చేయడం అనేది ఒక సాహసమే. హను రాఘవపూడికి ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. ప్రభాస్‌లోని సున్నితమైన కోణాన్ని క్లాసిక్ గా మ‌ల‌చ‌బోతున్నాడు.డార్లింగ్ మునుపెన్న‌డు అలాంటి పాత్ర పోషించింది లేదు. దీంతో ఆ ఎక్స్ పీరియ‌న్స్ అత‌డికి కొత్త‌గానే ఉంటుంది.ఆరడుగుల బుల్లెట్ లాంటి సైనికుడు తన ప్రేయసి ముందు ఎంత వినయంగా, ఎంత ప్రేమగా ఉంటాడో చూపే సన్నివేశాలు సినిమాకే హైలైట్ కానున్నాయి. ఈ అందమైన ప్రేమ క్లైమాక్స్‌ ప్రేక్షకుల గుండె పిండేసేలా, కంటతడి పెట్టించే రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. ప్ర‌స్తుతం వాటికి సంబంధించిన స‌న్నివేశాలే చిత్రీక‌రిస్తున్నార‌ని తెలిసింది. విశాల్ చంద్రశేఖర్ బాణీలు ప్రతి ప్రేమ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయ‌ని చిత్ర వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News