కొత్తవి, పాతవి అన్నీ శుక్రవారమేనా?
అటు థియేటర్స్ లో.. ఇటు ఓటీటీల్లో శుక్రవారమే కొత్త కంటెంట్ వస్తుంది. ఇంతటితో అయిపోయిందని అనుకుంటే పొరపాటే.. కొంత కాలం క్రితం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన సంగతి విదితమే.;
శుక్రవారం.. వారంలో ఆ ఒక్క రోజు కోసం సినీ ప్రియులు ఎంతగానే ఎదురు చూస్తారు. ఎందుకంటే.. ప్రతి వీక్ లో శుక్రవారం నాడు థియేటర్స్ లో అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు థియేటర్స్ లో సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ అయ్యేవి. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా కల్చర్ మారిపోయింది.
శుక్రవారం థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేయడం సంప్రదాయంగా మారింది. ముందు హాలీవుడ్ లో.. ఆ తర్వాత బాలీవుడ్.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో అదే జరుగుతుంది. వీకెండ్ కలిసొస్తుందని.. ఫ్రైడే రిలీజ్ చేస్తారని అంతా అనుకుంటాం. కానీ దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయని చరిత్ర ఎప్పటికప్పుడు చెబుతుంటుంది.
అయితే కోవిడ్ టైమ్ లో ఓటీటీలకు డిమాండ్ పెరిగిందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అవి రాజ్యమేలుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఓటీటీలకు అట్రాక్ట్ అయిపోయారు. కాగా, ఓటీటీ నిర్వాహకులు.. ఎక్కువగా శుక్రవారమే కంటెంట్ ను విడుదల చేస్తున్నారు.
అటు థియేటర్స్ లో.. ఇటు ఓటీటీల్లో శుక్రవారమే కొత్త కంటెంట్ వస్తుంది. ఇంతటితో అయిపోయిందని అనుకుంటే పొరపాటే.. కొంత కాలం క్రితం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన సంగతి విదితమే. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి దూసుకుపోతున్నాయి.
అయితే రీ రిలీజ్ లను కూడా మేకర్స్ శుక్రవారమే చేస్తున్నారు. అలా.. శుక్రవారమే కొత్త సినిమాలు.. శుక్రవారమే ఓటీటీ విడుదలలు.. శుక్రవారమే రీ రిలీజ్ లు జరుగుతున్నాయి. అందుకే ఈ విషయంపై ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు ఫోకస్ చేయాలని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. దాని ఎఫెక్ట్ థియేట్రికల్ రిలీజ్ లపై పడుతుందంటున్నారు.
ఎందుకంటే రీసెంట్ గా రిలీజైన యంగ్ హీరో శ్రీవిష్ణు సింగిల్ మూవీ విషయంలో అదే జరిగింది. డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించిన ఆ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. శ్రీవిష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఆ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. కానీ మే 9న చిరు క్లాసికల్ హిట్ రీ రిలీజైన విషయం తెలిసిందే.
జగదేకవీరుడు అతిలోకసుందరి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సత్తా చాటింది. దీంతోపాటు ఓటీటీ రిలీజ్ ల ఎఫెక్ట్ కూడా సింగిల్ సినిమాకు తగిలింది. అలా లేకుంటే మరిన్ని వసూళ్లను కలెక్ట్ చేసేది. ఇప్పుడు ఈ వారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన భైరవం మూవీ రిలీజ్ అవ్వనుంది.
విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో అంచనాలు నెలకొనగా.. మే 30న విడుదల కానుంది. కానీ అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా రీ రిలీజ్ కానుంది. అప్పుట్లో సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా.. ఆ తర్వాత మంచి మూవీ హిట్ అవ్వలేదని ఫీలింగ్ అందరిలో ఉండిపోయిందనే చెప్పాలి.
కాబట్టి ఇప్పుడు ఆ సినిమాను మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అనేక మంది సినీ ప్రియులు రెడీ అవుతున్నారు. అందుకే భైరవం మూవీపై ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే అటు థియేట్రికల్ రిలీజ్ లు, రీ రిలీజ్ లు.. ఇటు ఓటీటీ రిలీజ్ లు ఒకరోజు పెట్టుకోవడం ఇబ్బందని చెబుతున్నారు. దానిపై మేకర్స్ ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.