అభిమానుల కోసం హీరోలంతా ఒక్కటి కాలేరా?
నచ్చిన హీరో కోసం అభిమానులు ప్రాణత్యాగానికైనా సిద్దమవ్వడం అన్నది టాలీవుడ్..కోలీవుడ్ లో మాత్రమే కనిపిస్తుంది.;
నచ్చిన హీరో కోసం అభిమానులు ప్రాణత్యాగానికైనా సిద్దమవ్వడం అన్నది టాలీవుడ్..కోలీవుడ్ లో మాత్రమే కనిపిస్తుంది. టికెట్ ఎంత రేటు ఉన్నా? అప్పు చేసి మరీ టికెట్ కొని నచ్చిన హీరో సినిమా చూసొస్తారు. రిలీజ్ కు ముందు థియేటర్ ను కొత్త పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తారు. భారీ కటౌట్లు..వాటికి పూల మాలలు వేసి అందంగా అలంకరిస్తారు. అక్కడా సొంత డబ్బులే ఖర్చు చేస్తారు.
ఇలా కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే? అభిమాని జేబు గుల్ల అవుతుంది. ఇక బహిరంగ ప్రీరిలీజ్ ఈవెంట్లు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. తమ హీరోని దగ్గరగా చూడాలని వేలాది మంది మధ్యలో కుమ్ము లాడుకుంటూ దగ్గరకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగితే ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి ఘటనలెన్నో. అభిమానం పేరుతో దురదృష్టవశాత్తు జరిగే ఘటనలు మరికొన్ని.
సోషల్ మీడియాలో అభిమానుల మధ్య యుద్దం మూడవ ప్రపంచ యుద్దాన్నే తలపించేలా అప్పుడ ప్పుడు తారస పడుతుంటుంది. ఒకర్ని ఒకరు దూషించుకోవడం..కేసులు పెట్టుకోవడం...కోర్టులు చుట్టూ తిరగడం ఇదంతా ఒక సినారే. ఇలా ఎలా చూసిన అంతిమంగా ఇక్కడ నష్టపోయేది అభిమాని. ఆ కుటుంబాలు మాత్రమే. ఇలాంటి విషయాల్లో అభిమానులు తీరు మార్చుకోవాలని స్టార్ హీరోలు చాలా మంది ఇప్పటికీ చెబుతూనే ఉంటారు.
ఇంట్లో కుటుంబ సభ్యులు, తోబుట్టువులు తర్వాత తమని అభిమానించాలని...అనవసరంగా డబ్బు వృద్దా చేసుకోవద్దని హీరోలు ఎప్పటికప్పుడు చెబుతుంటారు. కానీ అది అక్కడికే పరిమితమవుతుంది. దీనిపై హీరోలు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అభిమానుల విషయంలో హీరోలే బాధ్యత తీసుకోవాలంటున్నారు. దీనికి సంబంధించి హీరోలంతా ఒకేతాటిపై కి వచ్చి అవేర్ నెస్ కార్యక్రమాలు చేపట్టాలంటున్నారు.
పబ్లిక్ వేదికలపై జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్లిపోతే సరిపోదని ఆ మాటని అభిమానుల్లోకి బలంగా తీసుకెళ్లాలని...దానికి సంబంధించి వారిలో చైతన్యం తీసుకొచ్చేలా చర్యలు, కార్యచరణ ఉండాలం టున్నారు. అభిమానం పేరుతో కోట్ల రూపాయల సంపాదన ఒక్కటే భావ్యం కాదని..వారి జాగ్రత్తల విష యంలోనూ తగిన చర్యలు తీసుకోవడం విధిగా భావించాలని కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి.