దృశ్యం3 ఏప్రిల్ నుంచి మేకు షిఫ్ట్?
మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన దృశ్యం3 మరోసారి వార్తల్లో నిలిచింది.;
మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన దృశ్యం3 మరోసారి వార్తల్లో నిలిచింది. రిలీజ్ డేట్ పై నెలకొన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు ట్రేడ్ వర్గాలు, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటగా ఏప్రిల్ 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మోహన్ లాల్, మీనా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
కేరళ ఎలక్షన్లు ఒక కారణం!
అయితే, రిలీజ్ డేట్ విషయంలో తీసుకోబోయే తుది నిర్ణయం పలు పరిస్థితులపై ఆధారపడి ఉండటం గమనార్హం. అందులో ముఖ్యంగా, కేరళలో జరగనున్న ఎన్నికలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా మారినట్లు సమాచారం. ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో, ఆ ముందు వారంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రచారం ఉధృతంగా సాగనుంది. ఈ సమయంలో సినిమా ప్రమోషన్స్ నిర్వహించడం కష్ట సాధ్యమవుతుందని, ప్రేక్షకుల దృష్టి కూడా ఎక్కువగా రాజకీయాలపైనే ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా, ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా నిర్మాతలను ఆలోచనలో పడేశాయని తెలుస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు మలయాళ సినిమాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్నాయి. అయితే అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం, భద్రతా ఆందోళనలు థియేట్రికల్ బిజినెస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గల్ఫ్ మార్కెట్‌లో దృశ్యం సిరీస్‌కు ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ అంశాన్ని లైట్ తీసుకోలేమని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.
మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేద్దామని సన్నాహాలు
ఈ నేపథ్యంలో, సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేయకుండా వాయిదా వేసి, మే మొదటి వారంలో కొత్త రిలీజ్ డేట్ రిలీజ్ డేట్ ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈలోగా ఎన్నికల ప్రభావం తగ్గడంతో పాటూ, విదేశీ మార్కెట్ పరిస్థితులు కూడా కొంతవరకు స్థిరపడే అవకాశముందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే, త్వరలో మొదలవాల్సిన ప్రమోషన్స్ ను కూడా ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. సరైన టైమ్ చూసుకుని విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహించాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉందని సమాచారం. మొత్తానికి, జార్జ్‌కుట్టి పాత్రను మరోసారి తెరపై చూడాలనే ఆసక్తితో ఉన్న అభిమానులు కొంత నిరాశ చెందుతున్నప్పటికీ, మంచి రిలీజ్ డేట్ ను సెలెక్ట్ చేసుకుని సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే నిర్మాతల లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో అందరూ దృశ్యం3 రిలీజ్ డేట్ విషయంలో అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నారు.