ట్రాన్స్‌జెండ‌ర్ వైద్యురాలి సాహ‌స‌గాధ విని షాకైన మెగాస్టార్

చిన్నతనం నుంచి ఒక పురుషుడిగా ఉంటూ.. మహిళగా మారాలనుకున్న తన జెండర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రయాణాన్ని ప్రాచీ ఈ వేదికపై షేర్ చేసారు.

Update: 2026-08-28 03:59 GMT

రియాలిటీ క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` (KBC) 18వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఇటీవలి ఎపిసోడ్‌లో ట్రాన్స్‌జెండర్ వైద్యురాలు డాక్టర్ ప్రాచీ రాథోడ్ పాల్గొని.. తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు.. సాధించిన విజయాలను షేర్ చేసారు. సమాజంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా దేనికీ లొంగకుండా వైద్య విద్యను పూర్తి చేసిన ఆమె పట్టుదలను అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా అభినందించారు.

చిన్నతనం నుంచి ఒక పురుషుడిగా ఉంటూ.. మహిళగా మారాలనుకున్న తన జెండర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రయాణాన్ని ప్రాచీ ఈ వేదికపై షేర్ చేసారు. ఈ నిర్ణయం చెప్పినప్పుడు సొంత కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆమోదించలేకపోయారని తెలిపారు. ఆ కష్టకాలంలో హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలోని `హవేలీలు` తనకు రెండో ఇల్లుగా మారాయని... వారు అందించిన ప్రోత్సాహంతోనే తండ్రి కన్న కలలను నిలబెట్టుకుంటూ చదువును ముందుకు తీసుకెళ్లానని ఎమోషనల్ అయ్యారు.

ఎంబీబీఎస్ పూర్తి చేసినా సమాజంలో లింగ వివక్ష కారణంగా ఉద్యోగం సంపాదించడం అత్యంత కష్టంగా మారిందని ప్రాచీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆసుపత్రులకు రెజ్యూమ్‌లు పంపి.. ఇంటర్వ్యూలకు హాజరైనా కేవలం ట్రాన్స్‌జెండర్ అనే కారణంతో చాలా చోట్ల అవకాశాలు తిరస్కరించార‌ని ఆమె గుర్తుచేసుకున్నారు. అయినా అధైర్యపడకుండా పోరాడి చివరికి వైద్యురాలిగా నిలబడ్డానని చెప్పారు.

ప్రాచీ ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను చూసి అమితాబ్ బచ్చన్ ముగ్ధులయ్యారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయని మేం అర్థం చేసుకోగలం. కానీ మీకు జరిగిన దేన్నీ దాచకుండా.. సమాజానికి ధైర్యంగా చెబుతూ ముందుకు సాగడం అభినందనీయం. అన్ని రకాల మార్పులను స్వీకరించి చదువు పూర్తి చేసి.. ఈ రోజు ప్రజలకు వైద్యం అందించే డాక్టర్‌గా మారినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు! అని అమితాబ్ కొనియాడారు.

సమాజంలో ఎదురయ్యే వివక్షను అధిగమించి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించి వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన డాక్టర్ ప్రాచీ రాథోడ్ కథనం కేబీసీ వేదికపై వీక్షకులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. రొటీన్ సమాజపు కట్టుబాట్లను తెంచుకుని.. సొంత కష్టంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రయాణంపై సోషల్ మీడియాలో కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Tags:    

Similar News