ప్ర‌తిభ‌కు ఛాన్స్.. దీపిక ప‌దుకొనే ఆన్‌సెట్ ప్రోగ్రామ్

సినీప‌రిశ్ర‌మ‌లో ఔత్సాహిక‌ ప్ర‌తిభ‌ను గుర్తించి వారికి మంచి అవ‌కాశాల‌ను క‌ల్పించాల‌ని భావించే కొంద‌రు ఉన్నారు.;

Update: 2026-01-06 04:55 GMT

సినీప‌రిశ్ర‌మ‌లో ఔత్సాహిక‌ ప్ర‌తిభ‌ను గుర్తించి వారికి మంచి అవ‌కాశాల‌ను క‌ల్పించాల‌ని భావించే కొంద‌రు ఉన్నారు. టాలీవుడ్ లో ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు(అగ్ర నిర్మాత‌లు) ప్ర‌తిభావంతుల‌కు నిరంత‌రాయంగా అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ప్ర‌భాస్ త‌న యువి క్రియేష‌న్స్ స్నేహితుల‌తో క‌లిసి ఎప్ప‌టిక‌ప్పుడు వ‌ర్క్ షాప్ లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ప్ర‌తిభావంతులైన ర‌చ‌యిత‌ల‌ను గుర్తించి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌నే త‌ప‌న అత‌డిలో ఉంది.

ఇప్పుడు త‌న క‌ల్కి కోస్టార్ ప్ర‌భాస్ లాంటి చాలా మంది స్ఫూర్తితో దీపిక ప‌దుకొనే కూడా ఒక బృహ‌త్త‌ర‌మైన ప్రయ‌త్నం చేస్తోంది. సినీప‌రిశ్ర‌మ‌లోని కీల‌క శాఖ‌ల‌లో అనుభ‌వం పొందేందుకు ఔత్సాహిక ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని దీపిక ప‌దుకొనే భావిస్తోంది. దీనికోసం ఒక ప్ర‌త్యేక‌మైన కార్య‌క్ర‌మాన్ని కూడా రూపొందిస్తోంది.

నటి కం నిర్మాత దీపికా పదుకొనే సోమవారం తన పుట్టినరోజును పుర‌స్క‌రించుకుని తదుపరి తరం సృజనాత్మక ప్రతిభకు స‌హ‌కారం అందించేందుకు ఒక శిక్ష‌ణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినిమా టీవీ రంగాల‌తో పాటు, ప్రకటనల పరిశ్రమలో కెరీర్‌ను కొనసాగించడానికి ఔత్సాహిక సృజనాత్మక కళాకారులను ప్రోత్స‌హిస్తూ వారికి మ‌రింత ఉన్న‌త‌మైన నైపుణ్యం అందించేందుకు త‌న‌ క్రియేట్ విత్ మీ ప్లాట్‌ఫామ్ లో 'ది ఆన్‌సెట్ ప్రోగ్రామ్`ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

తన ఇన్‌స్టాలో ఒక వీడియోను దీపిక షేర్ చేసి ఇలా అన్నారు. ''గత సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న ప్ర‌తిభ‌తో పాటు, దేశం వెలుపల నుండి వ‌చ్చిన వారిలో అద్భుతమైన సృజనాత్మక ప్రతిభను గుర్తించి వారికి న‌చ్చిన వేదిక‌ల‌పై అవ‌కాశాలు క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నించాము. ది ఆన్‌సెట్ ప్రోగ్రామ్ ని ప్ర‌క‌టించ‌డం ఆనందాన్నిచ్చింది. జెన్ జెడ్ సృజనాత్మక ప్రతిభను పరిచయం చేయడానికి నేను వేచి ఉండలేను'' అని దీపిక అన్నారు. తాము ఎంపిక చేసుకున్న విభాగంలో సుశిక్షితుల‌ను చేసేందుకు దీపిక ఈ ప్ర‌త్యేక శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని డిజైన్ చేసారు.

రచన, దర్శకత్వం, కెమెరా, లైటింగ్, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్, హెయిర్ స్టైలింగ్, మేకప్ ఆర్టిస్ట్రీ, ప్రొడక్షన్ విభాగాలలో మొదటి దశలో శిక్ష‌ణ అందుబాటులో ఉంటుంద‌ని దీపిక తెలిపారు. దీపిక ప‌దుకొనే కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, ప్ర‌స్తుతం అల్లు అర్జున్- అట్లీ కాంబినేష‌న్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News