భార్య వేధిస్తుందని పోలీసులను ఆశ్రయించిన నటుడు
విదేశాల నుంచి తిరిగొచ్చాక వారిద్దరికీ తమ ఇంట్లో గొడవ జరిగిందని, తనపై గూండాలను పిలిపించి వారితో దాడి చేయించి చంపేస్తానని బెదిరించిందని ఆరోపించారు.;
కన్నడ సీరియల్స్, శివాజీ సూరత్కల్ అనే సినిమాలో నటించిన నటుడు ధనుష్ రాజ్ తన పెళ్లి జీవితం సరిగా లేదని, భార్య తనను టార్చర్ చేస్తుందని పోలీసులను ఆశ్రయించారు. ధనుష్ రాజ్ కు 9 నెలల కిందట ఆశ్రిత అనే యువతితో పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత నుంచి వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు రావడంతో ఈ జంట ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.
తనపై తన భార్య ఆశ్రిత పదే పదే అనుమాన పడుతూ వేధిస్తుందని ధనుష్ గిరినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాను అబద్ధం చెప్తున్నానని, తాను వర్క్ పై విదేశాలకు వెళ్తే వేరే మహిళతో విదేశాలకు వెళ్లానని అనుమానించి, తన శారీరకంగా హింసిస్తోందని, తనపై దాడి కూడా చేసిందని ధనుష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనుమానంతో శారీరకంగా దాడి చేసింది
విదేశాల నుంచి తిరిగొచ్చాక వారిద్దరికీ తమ ఇంట్లో గొడవ జరిగిందని, తనపై గూండాలను పిలిపించి వారితో దాడి చేయించి చంపేస్తానని బెదిరించిందని ఆరోపించారు. అంతేకాకుండా బాత్రూమ్ అద్దం పగలకొట్టి చేతిని కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించిందని ఆయన ఆరోపిస్తూ, నిరంతర వేధింపులు, బెదిరింపులను దృష్టిలో పెట్టుకుని తనకు రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ధనుష్ చెప్పారు.
అదనపు కట్నం కోసం వేధింపులు
ఈ విషయంలో ఆశ్రిత కూడా ధనుష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం ధనుష్ తనను వేధిస్తున్నాడని, పెళ్లి టైమ్ లో 50గ్రాముల బంగారం ఇచ్చినా, ఇప్పుడు మళ్లీ మరో రూ.8 లక్షల డబ్బు కావాలని ప్రెజర్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతోపాటూ ధనుష్ కు వేరే మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, వేరే అమ్మాయిలతో అతను దిగిన ఫోటోలు కూడా ఉన్నాయని, తనకు అబద్ధం చెప్పి వేరే మహిళతో కలిసి విదేశాలకు వెళ్లాడని ఆరోపించారు. అయితే ధనుష్, ఆశ్రిత ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించనున్నారు. మరి ఈ విషయంలో తప్పెవరిదనేది తేలాల్సి ఉంది.