మెగా 'విశ్వంభర' పని పూర్తి అయినట్లేనా?

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' సినిమా విషయంలో ఫ్యాన్స్‌ గందరగోళంతో ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు నిర్మించిన ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో కిందా మీదా పడుతున్నట్లుగా తెలుస్తోంది.

Update: 2026-07-21 07:49 GMT

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' సినిమా విషయంలో ఫ్యాన్స్‌ గందరగోళంతో ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు నిర్మించిన ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో కిందా మీదా పడుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ టేబుల్‌ పై ఉండటంను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మెగాస్టార్‌ వంటి హీరోతో సినిమాను చేసేప్పుడు దర్శకుడు అన్ని విషయాలను ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో విజువల్‌ వండర్స్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. దర్శకుడు వశిష్ట ప్లానింగ్‌ లేకపోవడం వల్లే విశ్వంభర ఆలస్యం అయిందంటూ మెగా ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం అయినా సినిమాలో మంచి కంటెంట్‌ ఉంటే తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ దక్కడం ఖాయం, అలాగే భారీ వసూళ్లు నమోదు కావడం కూడా ఖాయం.

విశ్వంభర సినిమా విడుదల తేదీ...

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశాడనే విషయం తెల్సిందే. వీఎఫ్‌ఎక్స్ ఆలస్యంపై చిరంజీవ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. దర్శకుడు క్లారిటీగా లేకపోవడం వల్ల వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఆలస్యం అవుతున్నట్లు సోషల్‌ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. మొత్తానికి సినిమా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదిలో విడుదల చేయాల్సిందే అని చిరంజీవి దర్శకుడు వశిష్ట కు చెప్పాడట. దాంతో వశిష్ట వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ను చివరి దశకు తీసుకు వచ్చాడని, తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టులో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తి అవుతుందని, ఆ వెంటనే పెండింగ్‌ రీ రికార్డింగ్‌ పూర్తి చేస్తారని సమాచారం అందుతోంది. సినిమాను దసరా కానుకగా విడుదల చేసే విషయమై యూనిట్‌ సభ్యులు పట్టుదలతో ఉన్నారట.

చిరంజీవి బర్త్‌డే సందర్భంగా...

ఆగస్టులో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విశ్వంభర నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వస్తుందని యూవీ క్రియేషన్స్‌ కు చెందిన వారు అంటున్నారు. బిగ్‌ అప్‌డేట్‌ అంటే కచ్చితంగా రిలీజ్ డేట్‌ అయ్యి ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాకు ఇంతకు ముందు ఉన్న బజ్‌ ఇప్పుడు లేదు అని చెప్పక తప్పదు. అయితే చిరంజీవి సినిమా కనుక రెండు వారాల పబ్లిసిటీతో హైప్‌ పీక్స్‌కు తీసుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే సినిమా ప్రమోషన్‌లో భాగంగా వదిలే కంటెంట్‌ బాగుండాలి, జాగ్రత్తగా వదలాలి అని విశ్లేషకులు అంటున్నారు. విశ్వంభర టీజర్‌ అంటూ వచ్చిన ఒక వీడియోలోని వీఎఫ్‌ఎక్స్‌ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. అందుకే వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న మెగా 158 సినిమా 2027 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కనుక ఈ లోపే విశ్వంభర విడుదల చేయాలని మెగా కాంపౌండ్‌ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూపులు....

చిరంజీవి గతంలో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రేంజ్‌లో విశ్వంభర సినిమా ఉంటుందని ప్రచారం చేశారు. చిరంజీవి సుదీర్ఘ కాలం తర్వాత చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడంతో మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ సినిమా ఆలస్యం కావడంతో అభిమానుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తోంది. అయితే సినిమా విడుదల సమయంలో మంచి కట్స్‌తో ట్రైలర్‌ వస్తే కచ్చితంగా మెగాస్టార్‌ స్టామినా, క్రేజ్‌తో హైప్‌ క్రియేట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విశ్వంభర సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్‌ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈసారి విడుదల కచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. వచ్చే నెలలో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. చిరంజీవి వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో సంతృప్తి చెందితే తప్పకుండా సినిమా దసరాకు విడుదల అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News