చిరు అంతటివాడయ్యాడంటే ఈ దర్శకుడి చలువే
శోభన్ బాబుతో మోసగాడు చిత్రంలో నటించే అవకాశం కల్పించిన రాఘవేంద్రుడు, ఆ తర్వాత అన్నగారు ఎన్టీఆర్ సినిమాలోను ఛాన్సిచ్చారు.;
ఏ నటుడు అయినా ఎదగాలంటే గాడ్ ఫాదర్ ఉండాలి. ముఖ్యంగా సినీపరిశ్రమలో కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే గురువు ఉండాలి. మంచి సలహాలు సూచనలు ఉంటేనే ఇక్కడ మనుగడ సాగించడం సాధ్యమవుతుంది. కెరీర్ తొలి నాళ్లలో చిన్నా చితకా పాత్రల్లో నటించారు చిరంజీవి. విలన్ గా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలను కూడా చేసారు. ఆరంభం శోభన్ బాబు `మోసగాడు`లో ఒక కీలక పాత్రలో నటించారు. ఆ సమయంలోనే కె.రాఘవేంద్రరావు తో చిరుకు స్నేహం పెరిగింది. చిరులో ఉన్న ప్రతిభ ఎలాంటిదో రాఘవేంద్రరావు గ్రహించింది ఆ సినిమాతోనే. అప్పటికే మంచి డ్యాన్స్ చేయగల నటుడిగాను చిరుకు గుర్తింపు మొదలైంది.
శోభన్ బాబుతో మోసగాడు చిత్రంలో నటించే అవకాశం కల్పించిన రాఘవేంద్రుడు, ఆ తర్వాత అన్నగారు ఎన్టీఆర్ సినిమాలోను ఛాన్సిచ్చారు. `తిరుగు లేని మనిషి` చిత్రంలో చిరుకు అవకాశం కల్పించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఐదేళ్లలో చిరు నెమ్మదిగా ఎదిగేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సమయంలోనే కె.రాఘవేంద్రరావు చిరంజీవిని మాస్ హీరోగా ఎలివేట్ చేస్తూ `అడివి దొంగ` (1985) అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది మ్యూజికల్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ సినిమాతో రాఘవేంద్రరావుతో చిరు అనుబంధం పెరిగింది. అయినా ఒక పెద్ద దర్శకుడితో ఎదుగుతున్న యువకుడు సన్నిహితంగా ఉండేందుకు ఏదైనా ఇబ్బందికి గురవుతాడని భావించిన రాఘవేంద్రరావు అన్ని సందేహాలను తొలగించేలా చిరును `బాబాయ్` అని పిలిచేవారట.
అప్పటికి చిన్న చిన్న పాత్రలే చేసిన చిరంజీవిని పెద్ద స్టార్ ని చేసేందుకు రాఘవేంద్రరావు ఎంపిక చేసుకున్న స్క్రిప్టులు కూడా సహకరించాయి. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో 16 బంపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీటిలో ఘరానామొగుడు, కొండవీటి రాజా, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి చిత్రాలు కూడా ఉన్నాయి. శోభన్ బాబు, ఎన్టీఆర్ లాంటి దిగ్గజ హీరోల సినిమాల్లో నటించే అవకాశం కల్పించడమే గాక, ఆ తర్వాత కమర్షియల్ హీరోగా చిరును మాస్ లో నిలబెట్టేందుకు రాఘవేంద్రరావు చేసిన సహకారం అంతా ఇంతా కాదు. చిరంజీవికి భారీ మాస్ ఫాలోయింగ్ రావడానికి రాఘవేంద్రరావు ప్రధాన కారణం. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ చిరును ఎంతగానో ప్రోత్సహించి ఉండొచ్చు... ఒక హీరోని నిలబెట్టేందుకు దర్శకుడు చేసే మ్యాజిక్ చాలా ముఖ్యమైనది. ఆ రకంగా రాఘవేంద్రావు చిరుకు దేవుడితో సమానం.