యాక్ష‌న్ కామెడీ కోసం హేమా హేమీలు!

కొంత కాలంగా వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ 2025లో కాస్త వెన‌క్కి త‌గ్గింద‌నే చెప్పాలి.;

Update: 2026-01-03 06:21 GMT

కొంత కాలంగా వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ 2025లో కాస్త వెన‌క్కి త‌గ్గింద‌నే చెప్పాలి. కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌, క్రైమ్ థ్రిల్ల‌ర్స్‌, రొమాంటిక్ ల‌వ్‌స్టోరీల‌తో ఆక‌ట్టుకున్న మ‌ల్లూవుడ్ గ‌త ఏడాది మాత్రం అనుకున్న స్థాయిలో ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఎంపురాన్ 2, తుడ‌రుమ్ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసింది. అయితే క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్, న‌స్లెన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేడీ సూప‌ర్ హీరో మూవీ `లోక చాప్ట‌ర్ 1 చంద్ర‌`తో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. 2025లో విడుద‌లై రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన లేడీ సూప‌ర్ హీరో సినిమా ఇదే కావ‌డం విశేషం.

2025 మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నే విజ‌యాల్ని అందించింది. అయితే 2026 మాత్రం వాళ్ల‌కు స్పెష‌ల్ ఇయ‌ర్‌గా నిల‌వ‌నుంద‌ని తెలుస్తోంది. 2025లో కొంత వెన‌క‌బ‌డిని మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ ఈ ఏడాది మాత్రం వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డానికి రెడీ అవుతోంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌, మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి, టొవినో థామ‌స్‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌త్యేక‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు.

ఈ రేసులో ముందుగా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న యాక్ష‌న్ కామెడీ మూవీ `చ‌థా ప‌చ్చ‌`. ది రింగ్ ఆఫ్ రౌడీస్ అనేది ట్యాగ్ లైన్‌. రెజ్లింగ్ రింగ్ నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి రెజ్లింగ్ కోచ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇత‌ర పాత్ర‌ల్లో అర్జున్ అశోక‌న్‌, రోష‌న్ మాథ్యూ, విశాక్ నాయ‌ర్‌, సిద్ధిఖ్‌ న‌టిస్తున్నారు. అద్వైత్ నాయ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీకి శంక‌ర్ - ఎహ‌సాన్ - లాయ్ త్ర‌యం సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది.

బిజినెస్ ప‌రంగా ఇప్ప‌టికే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో భారీగా జ‌న‌వ‌రి 22న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా భాష‌ల్లో రిలీజ్ చేయ‌డానికి హేమా హేమీలు ముందుకు రావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్ వేఫ‌రెర్ ఫిలింస్ పై రిలీజ్ చేస్తుండ‌గా, తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు విడుద‌ల చేస్తున్నారు.

త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో పీవీఆర్ ఐనాక్స్ పిక్చ‌ర్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. ఇక నార్త్ ఇండియా అంత‌టా ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ పై క‌ర‌ణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. ఓవ‌ర్సీస్‌లోని దాదాపు 100 దేశాల్లో ది ప్లాట్ పిక్చ‌ర్స్ భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది. చిన్న మూవీ రిలీజ్ కోసం పాన్ ఇండియా వైడ్‌గా భారీ క్రేజ్ ఉన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఇలా ముందుకు రావ‌డంతో `చథా ప‌చ్చ‌`పై భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. రిలీజ్ విష‌యంలోనే హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీ రిలీజ్ త‌రువాత ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.



Full View


Tags:    

Similar News