ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా చైతన్య
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్ గోవాలో జరిగిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ రౌండ్ 4లో సందడి చేశారు.;
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్ గోవాలో జరిగిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ రౌండ్ 4లో సందడి చేశారు. ఉత్కంఠభరిత పోటీలు, మోటార్ స్పోర్ట్స్ ఉత్సాహంతో నిండిన ఈ ఈవెంట్‌లో చైతన్య స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. గోవా సర్క్యూట్‌లో నిర్వహించిన ఈ స్ట్రీట్ రేసింగ్ ఈవెంట్‌కు దేశం నలుమూలల నుంచి రేసింగ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరాగా, ఈ వేడుకలో తన సొంత ఫ్రాంచైజీ అయిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ కు సపోర్ట్ గా నాగ చైతన్య హాజరయ్యారు.
హైదరాబాద్ బ్లాక్ బర్డ్ ఓనర్ గా నాగచైతన్య
మోటార్ స్పోర్ట్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న నాగ చైతన్య, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ ఓనర్ గా ఈ రేసింగ్ లీగ్‌లో భాగమయ్యారు. గోవా వీధుల మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్‌పై కార్లు గర్జిస్తూ పరిగెత్తగా, వాటిని చూసి ప్రేక్షకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఈ హై-ఆక్టేన్ పోటీల్లో పాల్గొన్న డ్రైవర్లను నాగ చైతన్య స్వయంగా ప్రోత్సహిస్తూ కనిపించారు. ట్రాక్ పక్కనే నిలబడి జట్టు సభ్యులతో చర్చలు జరిపిన ఆయన, ప్రతి ల్యాప్‌ను ఆసక్తిగా వీక్షిస్తూ రేస్ వాతావరణాన్ని ఆస్వాదించారు.
కొత్త అనుభూతిని కలిగించిన స్ట్రీట్ సర్క్యూట్ ఫార్మాట్
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ఈ సీజన్‌లో ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ముఖ్యంగా స్ట్రీట్ సర్క్యూట్ ఫార్మాట్ రేసింగ్ అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. గోవాలో జరిగిన రౌండ్ 4 ఈవెంట్‌కు భారీగా ప్రేక్షకులు హాజరుకావడం, మోటార్ స్పోర్ట్స్‌పై యువతలో పెరుగుతున్న ఆసక్తిని స్పష్టంగా తెలియచేస్తుంది. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ పెర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్ ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. టీమ్ డ్రైవర్లు ఆత్మవిశ్వాసంతో పోటీ పడుతూ పాయింట్స్ టేబుల్ లో మెరుగైన స్థానాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు.
సినీ రంగంలోనే కాకుండా క్రీడారంగంలో కూడా తన ముద్ర వేసేందుకు నాగ చైతన్య చేస్తున్న ప్రయత్నాలు విశేషంగా కనిపిస్తున్నాయి. వ్యాపార దృక్పథంతో పాటు క్రీడా అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్తున్నారు. గోవా రేస్ సందర్భంగా అభిమానులతో మమేకమవుతూ, ఫోటోలు దిగుతూ కనిపించిన ఆయన ఈ ఈవెంట్‌కు హజరవడం దానికి మరింత గ్లామర్ ను జోడించింది. మొత్తంగా ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ రౌండ్ 4 గోవాలో విజయవంతంగా ముగియగా, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టుకు నాగ చైతన్య ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇక చైతన్య కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం చైతూ, కార్తీక్ దండు దర్శకత్వంలో తన 24వ సినిమాను చేస్తున్నారు.