అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. రామాయణ గురించి రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!
ప్రతి రెండు నెలలకోసారి రామాయణం గురించి కొత్తగా చెప్పుకునే కథ ఏదో ఒకటి ఉంటుందని రణబీర్ చెప్పుకొచ్చాడు.
రామాయణం.. ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని ఇతిహాసం. తరాలు మారుతున్నా ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ప్రతి తరానికి రామాయణం కొత్త అనుభూతిని ఇస్తోంది. అందుకే మన సినిమా ఇండస్ట్రీలో.. ఎన్నో భాషల్లో.. ఎంతోమంది.. ఎన్నిసార్లు రామాయణం తీస్తూ ఉన్న.. అది సూపర్ హిట్ అవుతూనే ఉంటుంది. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రామాయణలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలో రామాయణం గొప్పతనం గురించి రణబీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్నాయి.
రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. 1934లో తన తాతయ్య కూడా రాముడి పాత్రలో నటించారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రామాయణం ప్రేక్షకులకు ఎప్పుడూ బోర్ కొట్టలేదని అన్నారు. ప్రతి తరానికి ఈ ఇతిహాసం కొత్తగా అనిపిస్తుందని చెప్పారు.
ప్రతి రెండు నెలలకోసారి రామాయణం గురించి కొత్తగా చెప్పుకునే కథ ఏదో ఒకటి ఉంటుందని రణబీర్ చెప్పుకొచ్చాడు. ఇందులోని పాత్రలు, భావోద్వేగాలు, ధర్మం, కుటుంబ విలువలు ఎప్పటికీ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటాయి.
ఇక నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ సినిమా కోసం చిత్రబృందం భారీగా కష్టపడుతోంది. ఇదే ఇంటర్వ్యూలో..పుష్పక విమానం ఫైనల్ డిజైన్ ఖరారు చేయడానికి ముందు దాదాపు 40 నుంచి 50 డిజైన్లు రూపొందించినట్లు దర్శకుడు వెల్లడించారు. రావణుడు, జటాయువు మధ్య జరిగే యుద్ధ సన్నివేశాన్ని నటులకు వివరించడం నుంచి దాన్ని పూర్తి చేయడం వరకు ఆరున్నరేళ్లు పట్టిందని తెలిపారు.
రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, నితేశ్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం కథను మరోసారి వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.