అల్లు బాస్ పై బండ్ల కామెంట్స్.. బన్నీ వాస్ కౌంటర్.. చివరికి!
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ పై దర్శకుడు బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.;
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ పై దర్శకుడు బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు నిర్మాతలు బన్నీ వాసు, ధీరజ్ మొగిలినేని కౌంటర్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. అదే సమయంలో బండ్ల లేటెస్ట్ గా చేసిన మరో ట్వీట్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే?
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి లిటిల్ హార్ట్స్ మూవీ పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. తనూజ్ మౌళి, శివాని నాగరం జంటగా నటించిన ఆ సినిమా.. బడ్జెట్ కు అనేక రెట్లు లాభాలు సాధించింది. బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేయగా.. భారీ ప్రాఫిట్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఆ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బండ్ల గణేష్.. అనేక విషయాలు మాట్లాడారు. మౌళికి పలు సూచనలు ఇచ్చారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఆ సమయంలో లిటిల్ హార్ట్స్ సినిమా రిలీజ్ చేసి, కోటి- రెండు కోట్లు పెట్టి డబ్బులు ఖర్చు చేసిన వాసు, వంశీని అభినందించాలని చెప్పారు. అది మామూలు విషయం కాదని అన్నారు.
అంతా అల్లు అరవింద్ గారి సినిమా అంటున్నారని, అది ఆయన లక్- మీ బ్యాడ్ లక్ అంటూ వ్యాఖ్యానించారు. ఆయనేం చేయరని, లాస్ట్ మినిట్ లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారని ఆరోపించారు. ఆయన జాతకం అలాంటిందని, మనమేం చేయలేమని అన్నారు. అదే సమయంలో ఒక స్టార్ కమెడియన్ కొడుకుగా పుట్టారని అన్నారు.
ఆయన తలుచుకుంటే ఎవరైనా సరే అందుబాటులోకి వస్తారని, ఇలాంటి జీవితం అందరికీ రాదని తెలిపారు. దీంతో అదే వేదికపై నిర్మాతలు బన్నీ వాసు, ధీరజ్ కౌంటర్స్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్టార్ కమెడియన్ కు బిడ్డ కింద పుట్టలేదని, ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగయ్య స్టార్ కామెడియన్ అయ్యారని చెప్పుకొచ్చారు.
అది బండ్ల అన్నకు తెలియదేమో అంటూ బన్నీ వాస్ కౌంటర్ ఇచ్చారు. తనలాంటి వారికి ఎంతో ఇన్స్పిరేషన్ అని, ఆయన ఎప్పుడూ పరిగ్గెత్తిస్తారని తెలిపారు. ఆ తర్వాత సైలెంట్ గా వచ్చి అల్లు అరవింద్ క్రెడిట్ తీసుకెళ్లిపోతారని బండ్ల గణేష్ అన్న మాట చాలా తప్పు అని ధీరజ్ తెలిపారు. మాకంటే డబుల్ కష్టపడతారని చెప్పుకొచ్చారు.
ఆయన లేకుంటే తాము లేమని, ప్రోత్సహించి తమను ఇక్కడి వరకు తీసుకొచ్చారని చెప్పారు. తమ లాంటి వారందరికీ గాడ్ ఫాదర్ అని తెలిపారు. ఆయన స్టేటస్ ఎవరికీ రాదని అన్నారు. అలా బండ్ల గణేష్ కు కౌంటర్ ఇవ్వగా.. సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అయ్యి కామెంట్స్ పెడుతున్నారు.
అదే సమయంలో ఇప్పుడు బండ్ల మరో పోస్ట్ పెట్టారు. "అల్లు అరవింద్ గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత. ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్స్. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ వల్ల తెలుగు సినిమా గర్వంగా నిలిచింది. అల్లు అరవింద్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం" అని రాసుకొచ్చారు. మొత్తానికి బండ్ల కామెంట్స్, పోస్ట్ తోపాటు వాసు- ధీరజ్ కౌంటర్స్ హాట్ టాపిక్ గా మారాయి.