ట్రెండీ టాక్: పెళ్లిపై నటీమణుల టోన్ షాకిస్తోందే
ఇటీవలి కాలంలో పెళ్లిపై అభిప్రాయం మారుతోంది. పెళ్లి చేదుగా మారింది. ఒక మగాడు వేసే మూడు ముళ్లను ఏడు జన్మలకు ప్రతిబంధకాలుగా భావిస్తున్న సెలబ్రిటీ బాపతు లేదా అధునాతన యువతుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.;
ఇటీవలి కాలంలో పెళ్లిపై అభిప్రాయం మారుతోంది. పెళ్లి చేదుగా మారింది. ఒక మగాడు వేసే మూడు ముళ్లను ఏడు జన్మలకు ప్రతిబంధకాలుగా భావిస్తున్న సెలబ్రిటీ బాపతు లేదా అధునాతన యువతుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. దీని పర్యవసానంగా పుట్టుకొచ్చినదే సహజీవనం. పెళ్లితో పని లేకుండా నచ్చినన్ని రోజులు ఎంజాయ్ చేయడానికే యువతరం ప్రాధాన్యతనిస్తోంది.
అయితే ఇటీవల పలువురు టాప్ సెలబ్రిటీల వ్యాఖ్యలను పరిశీలిస్తే, పెళ్లి తంతుపై చాలా విసిగి వేసారిపోయారని అర్థమవుతోంది. అలాంటి వారిలో నటుడు గోవిందా భార్య సునీత అహూజా ముందు వరుసలో ఉంటారు.. వీలున్న ప్రతి వేదికపైనా తన భర్తను సునీత అహూజా తూర్పారబడుతోంది. తనకు పెళ్లిపై విసుగొచ్చిన భావనను కనబరుస్తున్నారు. అతడికి స్నేహితులు, వారితో పార్టీలు ముఖ్యం కానీ నేను కాదు.. అసలు గోవిందా లాంటి వ్యక్తిని ఏ జన్మలోను పెళ్లాడను అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు సునీత అహూజా. అంతగా పెళ్లిపై విసిగిపోయారు.
ఇటీవల రవీనా టాండన్ తో కలిసి ఓ చాట్ షోలో కాజోల్ దేవగన్ - పెళ్లికి ఒక ఎక్స్ పైరీ డేట్ ఉండాలి అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. పెళ్లికి ముందు కాబోయేవాడు ఎవరో ఏమిటో కూడా మగువకు తెలియదు. కానీ పెళ్లాడేస్తుంది. అందుకే పెళ్లికి ఒక ముగింపు తేదీ అనేది ఉంటే, ఆ రోజుతో భర్త కారనంగా టార్చర్ తొలగిపోయినట్టేననే భావనను వ్యక్తం చేసారు. కాజోల్ ఉపయోగించిన భాష కొంత క్లాస్ గా ఉంది కానీ, అంతిమంగా అర్థం మాత్రం ఇదే!
అమితాబ్ బచ్చన్ భార్య, వెటరన్ నటి జయా బచ్చన్.. ``పెళ్లి ఔట్ డేటెడ్`` అంటూ తీసిపారేసారు. యువతరం నచ్చినట్టు ఎంజాయ్ చేయండి! అని సూచించారు. తన మనవరాలు నవ్య నవేళి నందాను పెళ్లాడమని అస్సలు చెప్పనని కూడా అన్నారు. నిజానికి బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వెనకాడని జయాజీ వ్యాఖ్యలు నిజంగా యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇటీవలి కాలంలో పిల్లలు పెళ్లయిన వెంటనే మ్యారేజ్ ని రిజిస్టర్ చేసుకుంటున్నారు. నిజానికి మేం పెళ్లయిన చాలా సంవత్సరాలకు కానీ రిజిస్టర్ లో సంతకాలు చేయలేదు! అని నవ్వుతూ చెప్పుకొచ్చారు జయా బచ్చన్.
మలైకా అరోరా ఖాన్ - కొన్నేళ్లుగా పెళ్లి ఊసెత్తలేదు! పెళ్లి కంటే సహజీవనంలోనే సుఖం ఉంది అనే భావనను కనబరుస్తున్నారు. ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత అర్జున్ కపూర్ తో సహజీవనంపైనే మలైకా దృష్టి సారించారు. మేం ఇలానే హ్యాపీగా ఉన్నామని మలైకా కొన్నిసార్లు అన్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్- కియరా అద్వాణీ నటించిన ఓ బ్యాంక్ ప్రకటన కూడా రొటీన్ హిందూ సాంప్రదాయ పెళ్లిని కించపరిచింది. ఈ ప్రకటన చూడగానే అమీర్ ఖాన్ కి హిందూ వెడ్డింగ్ పై అంతగా నమ్మకం లేదని విమర్శలు చెలరేగాయి. ఇటీవల తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ మాట్లాడుతూ- పెళ్లికి తాను సిద్ధంగానే ఉన్నా, ప్రేమికుడితోనే చిక్కులు ఎదుర్కొంటున్నానని, పెళ్లి వరకూ వెళ్లకపోవడంతో చాలా విసిగిపోయానని వెల్లడించారు. తేజస్వి ప్రస్తుతానికి సోలో లైఫ్ నే ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. పెళ్లి పై చాలా మంది టోన్ మారిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలలో టోన్ అంతకంతకు మారుతోంది. అత్తారింటికి అమ్మాయి వెళ్లదు ఇక.. అబ్బాయే వెళ్లాలి!!