ట్రెండీ టాక్: టాలీవుడ్‌లో భీమవరం ఆణిముత్యాలు
తెలుగు సినిమా మాటల తీరును మార్చేసిన `మాటల మాంత్రికుడు` త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా భీమవరం వాస్తవ్యులే.;
అల్లూరి సీతారామరాజు పాదస్పర్శతో పునీతమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం గడ్డకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. కేవలం ఆక్వా రంగానికి, వాణిజ్యానికే కాకుండా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దిగ్గజాలను అందించిన ఘనత కూడా ఈ ప్రాంతానిదే. తాజాగా నటుడు రాజా రవీంద్ర ఒక పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న వివరాల ప్రకారం.. భీమవరం నేపథ్యం ఉన్న సెలబ్రిటీలు టాలీవుడ్‌ను ఏ విధంగా ప్రభావితం చేశారో అర్థమవుతోంది. నట వారసత్వం నుంచి మొదలుకొని.. స్వయంకృషితో ఎదిగిన ఎందరో స్టార్లకు ఈ ఊరు ఒక నిలయంగా మారింది.
నట దిగ్గజం, రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత ఊరు మొగల్తూరు అయినా ఆయన బాల్యం, విద్యాభ్యాసం అంతా భీమవరంతోనే ముడిపడి ఉంది. ఆయన వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్, నేడు`పాన్ ఇండియా స్టార్`గా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఈ ప్రాంత మూలాలు బలంగా ఉన్నాయి. అలాగే `మాస్ మహారాజా` రవితేజ జగ్గంపేటలో జన్మించినా.. భీమవరంలోని డీఎన్ఆర్ (DNR) కాలేజీలోనే ఆయన చదువు సాగింది. అందుకే రవితేజ ఇప్పటికీ తనను తాను గర్వంగా భీమవరం కుర్రాడిగా చెప్పుకుంటూ ఆ ప్రాంతంపై తనకున్న మమకారాన్ని చాటుకుంటారు.
తెలుగు సినిమా మాటల తీరును మార్చేసిన `మాటల మాంత్రికుడు` త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా భీమవరం వాస్తవ్యులే. ఆయన ప్రసంగాల్లో.. సినిమాల్లో గోదావరి యాస.. భీమవరం కబుర్లు తరచుగా వినిపిస్తుంటాయి. ఆయన ప్రాణ స్నేహితుడు, ప్రముఖ నటుడు సునీల్ కూడా ఇక్కడే పెరిగి.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరు మాత్రమే కాకుండా.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, లెజెండరీ నటుడు- దివంగత ఎం.ఎస్. నారాయణ, నటులు రాజా రవీంద్ర, సుదర్శన్ వంటి మరెందరో కళాకారులు భీమవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.
సినీ నటులే కాకుండా భీమవరం పట్టణానికి టాలీవుడ్ వాణిజ్య పరంగా కూడా ఒక విశిష్ట స్థానం ఉంది. జనాభా ప్రాతిపదికన చూస్తే.. దేశంలోనే అత్యధిక థియేటర్లు కలిగిన పట్టణాల్లో భీమవరం ఒకటిగా నిలుస్తుంది. ఇక్కడి ప్రేక్షకులు సినిమాను కేవలం వినోదంగానే కాకుండా ఒక వేడుకలా భావిస్తారు. అందుకే పెద్ద సినిమాల వసూళ్ల విషయంలో భీమవరం ఎప్పుడూ రికార్డులు సృష్టిస్తూ.. డిస్ట్రిబ్యూటర్లకు అత్యంత లాభదాయకమైన కేంద్రంగా (వసూళ్ల అడ్డా) పేరుగాంచింది.
మొత్తానికి భీమవరం చుట్టుపక్కల ఉన్న మొగల్తూరు, పాలకొల్లు వంటి ప్రాంతాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, అల్లు రామలింగయ్య వంటి మహామహులు కూడా రావడంతో ఈ ప్రాంత సినీ సంస్కృతి మరింత బలోపేతమైంది. ఈ గడ్డ అందించిన స్ఫూర్తితో ఎంతోమంది కొత్త టాలెంట్ ఈరోజు కూడా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. రాజా రవీంద్ర భీమవరం గడ్డ నుంచి సినీపరిశ్రమకు వచ్చిన ప్రముఖుల పేర్లను వెల్లడించడం విశేషం. ఈ ఆసక్తికర విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. భీమవరం వాసుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.