సీఎం ముందు మైక్ గిరా గిరా తిప్పిన బాలయ్య.. కానీ..
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.;
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. స్పెషల్ షెర్వానీ తో వచ్చిన.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వచ్చిన క్షణం నుంచి కార్యక్రమం అయినంత వరకు ఉత్సాహంగా కనిపించారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డును కార్యక్రమంలో భాగంగా అందుకున్నారు.
అయితే ఆ తర్వాత వేడుకను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు.. ఎప్పటిలానే చేతిలోకి తీసుకున్న మైక్ ను గిరా గిరా తిప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క షాకయ్యారు! ఒక్కసారిగా నవ్వులు చిందించారు. అందుకు సంబంధించిన వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.
అదే సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు బాలయ్య. అప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు చెప్పడానికి చాలా గ్యాప్ ఇచ్చారు. ఆ సమయంలో రేవంత్- భట్టి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత బాలయ్య విక్రమార్క పేరును పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.
అయితే తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం సంతోషకరమని బాలయ్య చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఎన్టీఆర్ అవార్డును ప్రారంభించారని చెప్పిన ఆయన.. ఇప్పటికే చాలా మంది అవార్డులు పొందారని చెప్పారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తనకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
అందుకు తన కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు బాలయ్య తెలిపారు. అదే సమయంలో తనకు అవార్డుతోపాటు ఇచ్చిన నగదును బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఇచ్చినట్టేనని వెల్లడించారు. యాక్టింగ్ లో ప్రయోగాలు చేసిన నటధీరుడు ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే వ్యక్తి అని అన్నారు.
అలాంటి వ్యక్తికి తాను కొడుకు అయినందుకు, ఇప్పుడు అవార్డు అందుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. పూర్వ జన్మ సుకృతమని వ్యాఖ్యానించారు. కళామతల్లికి ధన్యవాదాలు తెలిపారు. చివర్లో జై తెలంగాణ అంటూ నినాదించారు. అయితే రాష్ట్రాలు వేరైనా అంతరంగాలు ఒకటేనని.. యాసలు వేరైనా భాష ఒక్కటేనని తన తండ్రి చెప్పిన మాటలు బాలయ్య గుర్తు చేశారు.