వరుణ్ సినిమా సేఫ్

Update: 2018-06-23 17:30 GMT
ఒక కొత్త జానర్లో ఓ సినిమా తెరకెక్కుతున్నపుడు.. అదే జానర్లో.. అదే తరహా కథతో ముందే ఓ సినిమా వచ్చేస్తే చాలా ఇబ్బందే. దర్శకుడిగా తన తొలి సినిమా ‘ఘాజీ’తో గొప్ప పేరు సంపాదించిన సంకల్ప్ రెడ్డి.. అదే తరహలో మరో విభిన్న ప్రయత్నానికి సిద్ధమవుతూ తెలుగులో తొలి స్పేస్ ఫిలిం చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా ఆ సినిమా మొదలు పెట్టాడు. ఇంతలోనే తమిళంలో ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమా రెడీ అయింది. అది కూడా స్పేస్ సినిమానే. ఇండియాస్ ఫస్ట్ ఫుల్ లెంగ్త్ స్పేస్ ఫిలిం అంటూ దీని గురించి ప్రచారం చేసుకున్నారు. ఐతే ఇక్కడ తెలుగులో స్పేస్ ఫిలిం తెరకెక్కుతున్న సమయంలోనే ఆ చిత్రం రిలీజవడంతో ఇబ్బందిగా మారింది. ముందే ఆ జానర్లో సినిమా చూసేసిన ప్రేక్షకులు తమ చిత్రం విషయంలో ఎలా స్పందిస్తారో అన్న సందేహాలు చిత్ర బృందంలో ఉన్నాయి.

ఐతే ‘టిక్ టిక్ టిక్’ సినిమా చూస్తే దీని గురించి సంకల్ప్-వరుణ్ చిత్ర బృందం మరీ కంగారు పడాల్సిన పనేమీ లేదనే అనిపిస్తుంది. అది పేరుకే స్పేస్ ఫిలిం కానీ.. చాలా వరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగే అనిపిస్తుంది. దాన్ని అలా డీల్ చేశాడు దర్శకుడు. వాస్తవికతకు దూరంగా.. బోలెడంత హీరోయిజం.. కమర్షియల్ హంగులు అద్దేసి ఇదసలు స్పేస్ ఫిలిమేనా అనిపించాడు. సినిమా ఆసక్తికరంగానే సాగుతుంది కానీ.. సీరియస్ నెస్ లేదు. ఇంటెన్సిటీ లేదు. ఒక జెన్యూన్ ఎఫర్ట్ లాగా ఇది అనిపించదు. సంకల్ప్ ఈ తరహాలో సినిమా చేయకపోవచ్చనే ఆశించవచ్చు. ఎందుకంటే అతడి శైలి ఏంటన్నది ‘ఘాజీ’లోనే తెలిసింది. దాన్ని చాలా సిన్సియర్‌ గా తీశాడతను. ఎక్కడా అసలు విషయం నుంచి డీవియేట్ కాలేదు. కమర్షియల్ హంగుల కోసమో.. హీరోయిజం కోసమో ప్రయత్నించలేదు. కథకు.. జానర్ కు కట్టుబడి సినిమా తీశాడు. సినిమా అంతా వాస్తవికంగా ఉండేలా చూసుకున్నాడు. తొలి సినిమా మంచి ఫలితాన్నిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్పేస్ ఫిలిం అంటూ మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఈసారి కూడా అతను రాజీ లేకుండా సినిమా తీస్తే మరో మంచి ఫలితం అందుకోవచ్చు.
Tags:    

Similar News