విలువైన ఆస్తులను దానం చేసిన సెలబ్రిటీస్..
సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును చాలామంది సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. మరి కొంతమంది వ్యాపార రంగంలో పెట్టుబడులుగా పెడుతున్నారు .;
సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును చాలామంది సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. మరి కొంతమంది వ్యాపార రంగంలో పెట్టుబడులుగా పెడుతున్నారు .ఇంకొంతమంది అలా సంపాదించిన డబ్బును చివరి క్షణాలలో దానధర్మాలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకొంతమంది తమ ఆస్తులలో కొంత ఆస్తిని పేదలకు, దేవాలయాలకు దానంగా రాసిస్తున్నారు.. అలా దానం రూపంలో వందల కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులను రాసిచ్చిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సినిమా అనే రంగుల ప్రపంచంలో అందాల కథానాయికగా ఒక వెలుగు వెలిగిన సినీ తార శ్రీ విద్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి, కర్ణాటక గాయని ML వసంతకుమారి కుమార్తె ఈమె. పుట్టిన ఏడాదికే తండ్రి ఆక్సిడెంట్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి ML వసంతకుమారి చూసుకోవాల్సి వచ్చింది. శ్రీ విద్యా 14 ఏళ్ల వయసులోనే కుటుంబ ఆర్థిక సంక్షోభంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. దాసరి నారాయణరావు సహాయంతో ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె రజినీకాంత్, కమలహాసన్ తో ఎక్కువగా సినిమాలు చేసింది.
ముఖ్యంగా కమలహాసన్ తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ వీరి పెళ్లికి ఆమె తల్లి అంగీకరించలేదు. దీంతో ప్రేమ బంధం మధ్యలోనే ముగిసిపోయింది. ఇక ఆ తర్వాత 1978లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్ ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత ఈమె పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తాన్ని అతను తన పేరు మీదకు మార్చేసుకున్నారట. అయితే వైవాహిక బంధం లో మనస్పర్ధలు రావడంతో 1980లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకుంది. అయితే 2003లో శ్రీవిద్యకి క్యాన్సర్ ఉన్నట్లు తెలియడంతో తన మరణానంతరం తన ఆస్తులను తన భర్తకు చెందకుండా అనాధ పిల్లలకు దానం చేసింది శ్రీవిద్య. అంతేకాదు ఒక ఫౌండేషన్ ద్వారా స్టార్ సెలబ్రిటీల సహాయంతో ఇంకొంత డబ్బును సేకరించి ఆ డబ్బును కూడా ఆమె అనాధ పిల్లలకు దానం చేసింది. 2006లో క్యాన్సర్ తో పోరాడి మరణించింది.
ఇకపోతే ఇక్కడ మరొక హీరోయిన్ తన ఆస్తి మొత్తాన్ని దానం చేయలేదు కానీ విలువైన ఆస్తులను దానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి అర్చన. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోకి నానమ్మ పాత్రలో నటించిన అర్చన.. ఒకప్పుడు హీరోయిన్గా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈమె తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారుగా రూ.100 కోట్ల విలువైన ఆస్తులను దానంగా రాసిచ్చింది.
ఇక వీరిద్దరే కాదు ప్రముఖ దివంగత నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి కూడా చిత్ర పరిశ్రమ కోసం భారీగా ఆస్తులను దానం చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు చిరంజీవి వంటి అగ్ర హీరోల సినిమాలలో విలన్ గా నటించి.. ప్రేక్షకులను మెప్పించిన ఎం ప్రభాకర్ రెడ్డి నటుడు మాత్రమే కాదు వైద్యుడు కూడా.. ఒకవైపు వైద్య వృత్తితో పాటు మరొకవైపు నటనలో కూడా సత్తా చాటారు. సినీ పరిశ్రమ ఒకప్పుడు మద్రాస్ లోనే ఉండేది. 90'లో మొదట్లో దానిని హైదరాబాదుకి తీసుకొచ్చారు.
ఇక దీనికోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో సహా చాలా మంది ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో స్టూడియోలు నిర్మించడం, సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేశారు. అలాంటి సమయంలో పేద సినీ కళాకారుల కోసం ఆ కాలంలోనే పది ఎకరాల పొలాన్ని దానంగా ఇచ్చేశారు ఎం ప్రభాకర్ రెడ్డి. అలా కట్టుకున్న కాలనీని ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ. హైదరాబాదులోని మణికొండలో ఈయన స్మారకార్థం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరును పెట్టారు. ప్రస్తుతం ఈ భూమి విలువ వందల కోట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇలా వీరితోపాటు మరికొంతమంది పేదలకు ఉచితంగా వందల కోట్ల విలువ చేసే ఆస్తులు దానంగా ఇచ్చి గొప్ప మనసున్న వ్యక్తులుగా చలామణి అవుతున్నారు.