ఎటాక్ చేయడం..అక్క‌డే సంపాదించ‌డం ఆవిడ‌కే చెల్లింది!

భారతీయ చిత్ర పరిశ్రమలో కంగనా రనౌత్ శైలే వేరు. అమ్మ‌డు ఓ పక్కన బాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలపై, స్టార్ హీరోలపై నిప్పులు చెరుగుతూనే అదే పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఉనికిని చాటుకుంటున్నారు.;

Update: 2026-03-18 07:46 GMT

భారతీయ చిత్ర పరిశ్రమలో కంగనా రనౌత్ శైలే వేరు. అమ్మ‌డు ఓ పక్కన బాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలపై, స్టార్ హీరోలపై నిప్పులు చెరుగుతూనే అదే పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఉనికిని చాటుకుంటున్నారు. సాధారణంగా ఎదిరు తిరిగితే అవకాశాలు కోల్పోవడం, కెరీర్ ముగిసిపోవడం చూస్తుంటాం. కానీ కంగనా విషయంలో ఇది పూర్తిగా భిన్నం. ఎటాక్ చేయడం, అదే సమయంలో అక్కడే తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం ఆమెకే చెల్లింది. చాలా కాలంగా కంగనా బాలీవుడ్‌లోని నెపోటిజం, మాఫియా పోకడలపై బహిరంగ యుద్ధం చేస్తున్నారు.

ఏ చిన్న వివాదం తలెత్తినా? సోషల్ మీడియా వేదికగా అమ్మ‌డు ముందుండి పరిశ్రమ తీరును ఎండగడుతున్నారు. పరిశ్రమలోని పెద్దలు ఆమెను తొక్కేయడానికి తెర వెనుక ఎన్ని రాజకీయాలు చేసినా? వాటన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కేవలం నటిగానే కాకుండా ఇప్పుడు ఎంపీగా రాజకీయాల్లోనూ రాణిస్తూ తన గొంతును మరింత బలంగా వినిపిస్తున్నారు. తాజాగా కన్నడ చిత్రం `కేడీ - ద డెవిల్` లోని `సర్కే చునర్` పాట వివాదం నేపథ్యంలో కంగనా మళ్ళీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బాలీవుడ్ తన స్థాయిని దిగజార్చుకుంటూ, అశ్లీలతను ప్రోత్సహిస్తోందని ఆమె ఘాటుగా విమర్శించారు.

ప్రేక్షకులను ఆకర్షించడానికి చౌకబారు ట్రిక్కులు ప్లే చేస్తున్నారని, ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ప్రభుత్వం కఠినమైన నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో ఉంటూనే, అదే పరిశ్రమలోని లోపాలను నిర్మొహమాటంగా ఎత్తిచూపడం కంగనాకే చెల్లింది. కంగనా చేసే ఈ విమర్శలు కేవలం మాటలకే పరిమితం కావు. ఆమె తన సినిమాల ద్వారా కూడా భారతీయ సంస్కృతిని, వీరత్వాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆమె వ్యతిరేకించే అదే బాలీవుడ్ మేకర్స్ ఆమెతో సినిమాలు చేయడానికి మొగ్గు చూపడం విశేషం. ఆమెకు ఉన్న క్రేజ్, నటనలో ఉన్న ప్రతిభ కారణంగా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆమెను పూర్తిగా పక్కన పెట్టలేక పోతున్నారన్న‌ది కాద‌న‌లేని నిజం. ఇది కంగ‌న‌ సంపాదించుకున్న ఓ అరుదైన స్థానంగా చెప్పొచ్చు.

కేడీ పాట వివాదాన్ని కంగనా సమర్థవంతంగా త‌ప్పికొట్టారు. నోరా ఫతేహి నటించిన ఆ పాటలోని సాహిత్యం , డ్యాన్స్ స్టెప్స్ కుటుంబంతో కలిసి చూసేలా లేవన్న నెటిజన్ల ఆవేదనకు ఆమె ఒక గొంతుకగా మారారు. ఈ క్రమంలోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు ఇవ్వడం, పాటను యూట్యూబ్ నుంచి తొలగించడం వంటి పరిణామాలు కంగనా చేసిన విమర్శలకు మరింత బలాన్ని చేకూర్చాయి. తన పోరాటం సరైనదేనని ఆమె మరోసారి నిరూపించుకున్నారు. ప్ర‌స్తుతం కంగ‌న ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆమె ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న `భార‌త భాగ్య విధాత` షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో ఉంది. అలాగే హిందీ, త‌మిళ్ లో ఏక కాలంలో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రంలోనూ న‌టిస్తున్నారు.

Tags:    

Similar News