మూడు దశాబ్దాల కాంబో రిపీట్.. బ్రేక్ ఈవెన్ సాధిస్తారా?
భారతీయ సినీ పరిశ్రమలో మణిరత్నం-ఏఆర్ రెహ్మాన్ జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.;
భారతీయ సినీ పరిశ్రమలో మణిరత్నం-ఏఆర్ రెహ్మాన్ జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక మ్యూజికల్ మ్యాజిక్. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక వార్త ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తోంది. మణిరత్నం తన తదుపరి సినిమా కోసం రెహ్మాన్‌ను కాకుండా వేరే సంగీత దర్శకుడిని తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు ఈ వార్తల్లో నిజమెంత? అభిమానులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో ఇప్పుడు చూద్దాం.
మూడు దశాబ్దాల బంధం.. ఇప్పుడు బ్రేక్?:
మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ ప్రయాణం 1992లో వచ్చిన 'రోజా' సినిమాతో మొదలైంది. అప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 30 ఏళ్లుగా వీరిద్దరూ విడదీయలేని జంటగా నిలిచారు. మణిరత్నం తీసే ప్రతి సినిమాకు రెహ్మాన్ సంగీతం ఒక ఆత్మలా నిలుస్తుంది. ఇక అయితే, ఇప్పుడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా మణిరత్నం ఒక ప్రేమకథను ప్లాన్ చేస్తున్నారని, అందుకోసం యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇళయరాజా, రెహ్మాన్ తర్వాత మణిరత్నం పని చేయబోయే మూడో సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అవుతారు.
కొత్త మార్పు.. కొత్త దారి?:
సినిమా ఇండస్ట్రీలో మార్పులు సహజం. గతంలో ఇళయరాజాతో ఎన్నో హిట్లు కొట్టిన మణిరత్నం, 'రోజా' సినిమా కోసం అప్పట్లో కొత్త కుర్రాడైన రెహ్మాన్‌ను పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది అప్పట్లో ఒక సంచలనం. ఇప్పుడు కూడా మణిరత్నం తన మేకింగ్ స్టైల్‌లో కొత్తదనం కోసం, యువతకు దగ్గరవ్వడం కోసం సాయి అభ్యంకర్ లాంటి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారా? అనే చర్చ నడుస్తోంది. కొంతమంది విశ్లేషకులు ఇది ఒక కొత్త శకానికి నాంది కావచ్చని అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అన్నది నిజం.
ఫ్యాన్స్‌లో మొదలైన టెన్షన్:
ఈ వార్త బయటకు రాగానే కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "మణిరత్నం సినిమా అంటే రెహ్మాన్ ఉండాల్సిందే.. ఆ మ్యాజిక్‌ను ఎవరూ రీప్లే చేయలేరు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలు ఇప్పటికీ,ఎప్పటికి ఎవర్ గ్రీన్. ఇలాంటి తరుణంలో వీరిద్దరూ విడిపోవడం తట్టుకోలేమని ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. అయితే, ఈ రూమర్లను పటాపంచలు చేస్తూ రెహ్మాన్ ఒక ఇంటర్వ్యూలో తాను మణిరత్నం నెక్స్ట్ మూవీకి వర్క్ చేస్తున్నానని చెప్పడం ఫ్యాన్స్‌కు కొంచెం ఊరటనిస్తోంది.
ప్రస్తుతానికి మణిరత్నం నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాయి అభ్యంకర్ పేరు వినిపిస్తున్నా, అది కేవలం పుకారు మాత్రమే కావచ్చని చాలా మంది నమ్ముతున్నారు. అయితే, మణిరత్నం లాంటి దర్శకుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ మ్యూజికల్ వార్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్ చేస్తుందో లేదో వేచి చూడాలి.