అనౌన్స్‌మెంట్ హైప్ vs రిలీజ్ రియాలిటీ.. పవన్ కళ్యాణ్ సినిమాల టైమ్‌లైన్ ట్రెండ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం గత కొన్నేళ్లుగా ఒక ప్రత్యేక దశలో కొనసాగుతోంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం గత కొన్నేళ్లుగా ఒక ప్రత్యేక దశలో కొనసాగుతోంది. భారీ అంచనాలతో అనౌన్స్ అయ్యే ప్రాజెక్టులు, మధ్యలో ఏర్పడే ఆలస్యాలు, చివరకు మారిపోయే మార్కెట్ పరిస్థితులు.. ఇవన్నీ కలిసి ఆయన సినిమాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆయన్నుంచి తాజాగా వచ్చిన మూడు ప్రధాన సినిమాల టైమ్‌లైన్ ఈ పరిస్థితిని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
పలు కారణాలతో ఆలస్యమైన వీరమల్లు
వాటిలో మొదటిది హరిహర వీరమల్లు. ఈ సినిమా 2020 జనవరిలో అనౌన్స్ అయింది. అయితే కరోనా, నిర్మాణ సమస్యలు, దర్శకత్వ మార్పులు వంటి అనేక కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ బాగా ఆలస్యమైంది. మొదట ఈ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి కొన్ని కారణాలతో మధ్యలోనే ప్రాజెక్ట్‌ను విడిచిపెట్టడంతో, నిర్మాత ఏఎం రత్నం కుమారుడు ఏఎం జ్యోతి కృష్ణ ఆ బాధ్యతల్ని చేపట్టి సినిమాను పూర్తి చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
పక్కా ప్లానింగ్ తో రిలీజైన ఓజి
ఇక ఓజి సినిమా మాత్రం పూర్తిగా భిన్నమైన ఉదాహరణగా నిలిచింది. 2022లో అనౌన్స్ అయిన ఈ సినిమా 2025 సెప్టెంబర్‌లో రిలీజైంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా మొదటి నుంచే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. రిలీజ్ తర్వాత కూడా మంచి మౌత్ టాక్ రావడంతో ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ను అందుకుంది. సినిమాను సరైన టైమ్‌లో పూర్తి చేసి, మంచి డేట్ లో రిలీజ్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది ఈ సినిమా నిరూపించింది.
ఎన్నో కారణాలతో ఆలస్యమైన ఉస్తాద్ భగత్‌సింగ్
ఇక పవన్ తాజా సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్ కూడా ఆలస్యాలతోనే ముందుకు సాగింది. 2020 ఫిబ్రవరిలో అనౌన్స్ చేయబడిన ఈ సినిమా, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ చివరకు 2026 మార్చిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటికే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దీర్ఘకాల ఆలస్యం ఈ హైప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది. సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో ఉన్న హైప్, రిలీజ్ సమయానికి అదే స్థాయిలో ఉండటం లేదు. దీని వల్ల నిర్మాతలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, డిస్ట్రిబ్యూటర్లు భారీ టికెట్ ధరల పెంపుతో నష్టాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పవన్ ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు రెండింటినీ సమాంతరంగా నడపడం వల్ల షెడ్యూల్స్‌లో మార్పులు రావడం సహజమే. కానీ అదే సమయంలో ఇది ప్రాజెక్టుల టైమ్‌లైన్, మార్కెట్ అంచనాలు, బిజినెస్ మోడల్‌పై ప్రభావం చూపుతోంది. అందువల్ల ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ తన ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తారా, లేక ఈ మిశ్రమ ధోరణి కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.