కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ' చిత్రానికి లీగల్ నోటీసులు
చందమామ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా హిందీ చిత్రం `ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్` వివాదంలో చిక్కుకుంది.
చందమామ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా హిందీ చిత్రం `ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్` వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్ , ప్రమోషనల్ కంటెంట్‌లో భారతీయ వ్యవసాయ రంగం, డైరీ (పాల) పరిశ్రమ, పౌల్ట్రీ రంగాలపై తప్పుడు, అపవాదుతో కూడిన- శాస్త్రీయ ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ ఈ చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. `అగ్రి బిజినెస్ సెంటర్` అధినేత భవేష్ సోధా తరపున న్యాయవాది హిరణ్య పాండే జూన్ 15న ఈ నోటీసులను జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ ఎల్.ఎల్.పి సహా చిత్రబృందానికి నోటీసులు పంపినట్లు `బాలీవుడ్ హంగామా` వెల్లడించింది.
మొత్తం 18 పేజీలతో కూడిన ఈ లీగల్ నోటీసులో.. ఈ సినిమా భారతీయ వ్యవసాయ రంగాన్ని ఒక `స్లో పాయిజన్` లాగా చిత్రీకరించిందని ఫిర్యాదుదారుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పురుగుమందుల వాడకం, ఆహార కల్తీ , క్యాన్సర్ వ్యాధి గణాంకాలను ఈ సినిమాలో విపరీతంగా అంచనా వేసి చూపించారని... దీనివల్ల దేశంలోని కోట్లాది మంది రైతులు, పాల ఉత్పత్తిదారులు, పౌల్ట్రీ వ్యాపారస్థులు, వ్యవసాయ రసాయనాల సరఫరాదారుల ప్రతిష్టకు తీవ్ర భంగం కలుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. అలాగే ఈ దృశ్యాలు ప్రజలలో అనవసరమైన భయాందోళనలను రేకెత్తిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఈ సినిమా టీజర్‌లో చూపించిన కొన్ని విజువల్స్‌ను నోటీసులో సవాలు చేశారు. భారతదేశంలో పురుగుమందుల వాడకం మిగతా దేశాల కంటే హెక్టారుకు చాలా తక్కువగా ఉందని... కానీ సినిమాలో దాన్ని అతిగా చూపించారని పేర్కొన్నారు. అలాగే దేశంలోని మెజారిటీ పాలు కల్తీవనే అర్థం వచ్చేలా చూపించడాన్ని తప్పుబట్టారు. ఇక చనిపోయిన చికెన్ (కోడి) శరీరంలోకి సిరంజితో ఇంజెక్షన్ ఇస్తున్నట్లు చూపించిన ఒక సీన్‌ను ప్రస్తావిస్తూ.. ఇది శాస్త్రీయంగా అసాధ్యమని.. ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పద్ధతుల వల్లే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయనేలా చూపించడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు కావాలని ఫిర్యాదుదారుడు స్పష్టం చేశారు.
ఈ నోటీసు ద్వారా చిత్ర నిర్మాతలకు పలు డిమాండ్లు విధించారు. సినిమాలో చూపించిన ప్రతి ప్రధాన గణాంకానికి, విజువల్‌కు గల శాస్త్రీయ ఆధారాలను, పరిశోధనా పత్రాలను బయటపెట్టాలని కోరారు. అలాగే డిజిటల్ వేదికల నుండి ఈ సినిమా టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని... థియేటర్లలో విడుదల చేయడానికి ముందే సినిమాలో తగిన మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఏడు రోజుల్లోగా చిత్రబృందం దీనిపై స్పందించకపోతే సినిమా విడుదలకు వ్యతిరేకంగా హైకోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకురావడంతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు ఈ లీగల్ నోటీసు కాపీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) కి కూడా పంపారు. ఈ వివాదాస్పద కంటెంట్‌ను తొలగించే వరకు `ది ఇండియా స్టోరీ` చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరాదని... ఒకవేళ ఇప్పటికే ఇచ్చి ఉంటే దాన్ని వెనక్కి తీసుకోవాలని బోర్డును కోరారు. ఆహార భద్రతపై సమాజంలో అవేర్నెస్ తేవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశామని `ఇది దురదృష్టవశాత్తూ భారతదేశపు నిజమైన కథ` అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఈ లీగల్ నోటీసుల వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.