న్యూ వెర్షన్: `పెద్ది`లో అచ్చియ్యమ్మ సీన్లు కట్.. చరణ్ కొత్త సీన్లు యాడ్!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా `పెద్ది` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి దూసుకుపోతోంది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా `పెద్ది` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి దూసుకుపోతోంది. కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి... ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ అద్భుతమైన విజయంతో జోష్‌లో ఉన్న చిత్రబృందం రేపటి నుండి (గురువారం) థియేటర్లలో `పెద్ది` సరికొత్త వెర్షన్‌ను ప్రదర్శించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన `అచ్చియ్యమ్మ` పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు నచ్చని కొన్ని సీన్లు సినిమాలో ఉన్నాయనే టాక్ వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన చిత్రబృందం ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉన్న ఆ సన్నివేశాలను పూర్తిగా కట్ చేస్తున్నట్లు ప్రకటించింది. నెగెటివిటీకి తావివ్వకుండా మహిళా ప్రేక్షకులు కూడా సినిమాను మరింత హాయిగా ఆస్వాధించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు కట్ చేసిన సీన్ల స్థానంలో మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా రామ్ చరణ్ నటించిన మరికొన్ని ఇన్స్‌పైరింగ్ సీన్స్‌ను యాడ్ చేస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు సన ప్రామిస్ చేశారు. గతంలో ఎడిటింగ్‌లో తీసేసిన కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పుడు మళ్లీ జోడించడం ద్వారా సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని టీమ్ భావిస్తోంది. రేపటి నుండి మొత్తం 5 నిమిషాల 56 సెకన్ల అదనపు రన్‌టైమ్‌తో కూడిన కొత్త సీన్లు థియేటర్లలో కనిపించనున్నాయి. చరణ్ క్యారెక్టర్‌ను మరింత ఎలివేట్ చేసే ఈ సీన్స్ కథకు అదనపు బలాన్ని ఇవ్వనున్నాయి.
ఈ న్యూ వెర్షన్ అప్‌డేట్ మెగా అభిమానుల్లో సరికొత్త ఊపును తీసుకువచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఈ సరికొత్త ఇన్స్‌పైరింగ్ సీన్స్ చూడటం కోసం థియేటర్లకు రిపీటెడ్‌గా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను వెండితెరపై మరోసారి కొత్తగా ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఈ కొత్త మార్పులు సినిమా వసూళ్లను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం థియేటర్లలో టికెట్ ధరలు కూడా సాధారణ రేట్లకు అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు అదనపు సీన్లతో కూడిన న్యూ వెర్షన్ తోడవ్వడంతో.. `పెద్ది` చిత్రం మూడో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సరికొత్త వ్యూహం సినిమా వసూళ్లకు మరిన్ని రెక్కలు తొడగడమే కాకుండా... లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడానికి హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు.