రామ్ చరణ్ ఆర్సీ 17 లేట్ కానుందా?

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొంత కాలం ప‌ట్టేలా ఉంది. ఈ ఆలస్యానికి కారణం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి అని తెలుస్తోంది.

Update: 2026-06-17 19:01 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌నున్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్సీ 17` పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. `రంగస్థలం` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇద్ద‌రి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ రోజే ప్రాజెక్ట్ ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కేలా కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొంత కాలం ప‌ట్టేలా ఉంది. ఈ ఆలస్యానికి కారణం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి అని తెలుస్తోంది. చరణ్ త్వరలోనే ఓ చిన్న శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉందని సినీ వర్గాల సమాచారం.

వైద్యుల సలహా మేరకు సర్జరీ అనంతరం కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాను ప్రారంభించే ముందు పూర్తి ఫిట్‌నెస్ సాధించడం అత్యంత అవసరం కావడంతో చరణ్ ఈ లాంగ్ బ్రేక్‌ను తీసుకోక తప్పడం లేదంటున్నారు. హీరో అందుబాటులో లేకపోతే చిత్ర నిర్మాణ షెడ్యూల్స్ అన్నీ మారిపోతాయి. మొదట్లో అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2026లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పనులు ప్రారంభం కావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.

హీరో పూర్తిగా కోలుకున్న తర్వాతే కెమెరా ముందుకు రావాలని దర్శకుడు సుకుమార్ కూడా భావిస్తున్నారట. వచ్చే ఏడాది జనవరి లో చిత్రానికి సంబంధించిన ముహూర్తం నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. ఈ గ్యాప్‌ను దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులను మరింత పకడ్బందీగా, విజువల్స్ పరంగా సరికొత్తగా ప్లాన్ చేయడానికి ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తేలాల్సి ఉంది.

పెద్ది సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ చాలా క‌ష్ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కుస్తీ పోటీ లుక్ కోసం బాడీని ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం చేసాడు. అందుకోసం ఎంతో శ్ర‌మించారు. పాత్ర‌కు అవ‌స‌ర‌మైన ట్రాన్స‌ప‌ర్మేష‌న్ కోసం చాలా త్యాగాలు చేసారు. గాయ‌లు సైతం లెక్క చేయ‌కుండా షూటింగ్లో పాల్గొన్న రోజులున్నాయి. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ `పెద్ది` స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

స్టార్ హీరోల ప్రాజెక్టులలో ఇలాంటి ఊహించని మార్పులు సహజమే. రామ్ చరణ్ సర్జరీ నుంచి కోలుకుని తిరిగి రావడం, సుకుమార్ వైవిధ్యమైన శైలితో కథను మరింత పదును పెట్టడం వంటి అంశాలు ఈ ప్రాజెక్ట్‌ను మరింత గ్రాండ్‌గా మార్చొచ్చు. 2027 ఆరంభంలో ప్రారంభం కానున్న ఈ కాంబినేషన్? ఆలస్యంగా వచ్చినా థియేటర్లలో సరికొత్త సంచలనాలకు తెరలేపుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News