కబీర్ ఎంట్రీ వెనుక పెద్ద ప్లాన్? స్పై యూనివర్స్‌కు ఆల్ఫా కీలక మలుపు!

వాస్త‌వానికి ఆల్ఫా కేవలం ఆలియా భట్ సినిమా మాత్రమే కాదు. ఇది YRF స్పై యూనివర్స్ విస్తరణలో కీలకమైన అడుగు.

Update: 2026-06-17 16:30 GMT

బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆల్ఫా ఒకటి. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచ‌నాలేమీ లేవు. కొన్నాళ్ల కింద‌ట రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని రేకెత్తించలేకపోయింది. యాక్షన్, విజువల్స్ ఉన్నప్పటికీ స్పై యూనివర్స్‌కు తగ్గ స్థాయి థ్రిల్ కనిపించలేదనే విమర్శలు వినిపించాయి. దీంతో YRF స్పై యూనివర్స్‌లోని ఈ కీలక ప్రాజెక్ట్‌పై సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. టీజ‌ర్ కు యునానిమ‌స్ పాజిటివ్ రెస్పాన్స్ రాక‌పోయినా తాజాగా రిలీజైన ట్రైలర్ మాత్రం సినిమా పరిస్థితిని పూర్తిగా మార్చేసినట్లు కనిపిస్తోంది.

హై- ఆక్టేన్ యాక్షన్ సీన్స్, స్టైలిష్ విజువల్స్, ఎమోషనల్ టచ్, స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన బలాలుగా నిలిచాయి. ముఖ్యంగా ఆలియా భట్, శార్వరీలను పూర్తి స్థాయి యాక్షన్ హీరోయిన్లుగా ప్రెజెంట్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాబీ డియోల్ విలన్‌గా మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్‌ను చాటగా, అనిల్ కపూర్ పాత్ర కథకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం మాత్రం చివర్లో కనిపించిన హృతిక్ రోషన్ గ్లింప్స్. కేవలం కొన్ని క్షణాలే కనిపించినప్పటికీ, ఆయన ఎంట్రీ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. వార్ సినిమాలో ఆడియ‌న్స్ ను ఆకట్టుకున్న కబీర్ పాత్ర మళ్లీ కనిపించబోతుందనే సంకేతం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

వాస్త‌వానికి ఆల్ఫా కేవలం ఆలియా భట్ సినిమా మాత్రమే కాదు. ఇది YRF స్పై యూనివర్స్ విస్తరణలో కీలకమైన అడుగు. ఇప్పటివరకు వార్, ప‌ఠాన్, టైగ‌ర్ సిరీస్‌లతో నిర్మించిన ప్రపంచాన్ని ఇప్పుడు మహిళా స్పై పాత్రల వైపు విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. అలాంటి సమయంలో కబీర్ పాత్రను కథలో భాగం చేయడం ద్వారా ఆల్ఫాను డైరెక్ట్ గా స్పై యూనివర్స్‌తో అనుసంధానం చేసినట్లు ట్రైలర్ సూచిస్తోంది. ఇది కేవలం ఒక క్యామియోగా మాత్రమే మిగిలిపోతుందా? లేక ఫ్యూచ‌ర్ లో జరిగే పెద్ద క్రాస్‌ఓవర్ కథలకు బలమైన పునాది వేస్తుందా? అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

YRF కూడా ఇదే అంశాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించినట్లు కనిపిస్తోంది. టీజర్ తర్వాత తగ్గిన బజ్‌ను తిరిగి తీసుకురావడంలో హృతిక్ గ్లింప్స్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆల్ఫాకు ఇప్పుడు కేవలం ఓపెనింగ్స్ మాత్రమే కాదు, YRF స్పై యూనివర్స్ ఫ్యూచ‌ర్‌కు సంబంధించిన అంచనాలు కూడా జతకట్టాయి. ట్రైలర్‌తో వచ్చిన పాజిటివ్ రెస్పాన్ ను చూస్తుంటే, హృతిక్ రోషన్ క్యామియో ఈ సినిమాకు నిజంగానే గేమ్‌చేంజర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కబీర్ పాత్ర కథలో ఎంత ప్రాధాన్యతతో ఉంటుందన్న అంశమే ఇప్పుడు ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News