జక్కన్న టేబుల్ ప్రాఫిట్.. ఈసారి కెరీర్ లోనే టాప్?
ఇప్పుడు అదే అంచనాలు వారణాసిపై కనిపిస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఆ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో, ట్రేడ్ వర్గాల్లో కూడా అంతే నమ్మకం ఉంటుంది. ఆయన సినిమా విడుదలకు ముందే డీల్స్ ద్వారా భారీ బిజినెస్ జరగడం కొత్త విషయం కాదు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి విషయంలో ఆ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు చర్చ జరుగుతోంది.
అయితే సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపించే పదం టేబుల్ ప్రాఫిట్. అంటే మూవీ ప్రొడక్షన్ కు అయిన ఖర్చు కంటే, విడుదలకు ముందే థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటే నిర్మాతలు ముందుగానే లాభాల్లోకి వెళ్లినట్లే. అలాంటి సిచ్యువేషన్ నే టేబుల్ ప్రాఫిట్ గా ట్రీట్ చేస్తారు. రాజమౌళి కెరీర్ ను పరిశీలిస్తే ఆ ట్రెండ్ చాలా కాలంగా కనిపిస్తోంది.
ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లలో మంచి నమ్మకం ఏర్పడింది. వరుస విజయాలతో ఆ నమ్మకం మరింత బలపడింది. దీంతో ప్రతి కొత్త సినిమాకు గత చిత్రం కంటే ఎక్కువ బిజినెస్ జరగడం కామన్ అయిపోయింది. మగధీర, ఈగ వంటి చిత్రాల సమయంలో రాజమౌళి మార్కెట్ బాగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి సిరీస్ ఇండియన్ సినిమా మార్కెట్ ను పూర్తిగా మార్చేసింది.
ముఖ్యంగా బాహుబలి 2 విడుదలకు ముందే రైట్స్ రూపంలో భారీ ఆదాయం సాధించింది. ఆ సినిమా తర్వాత రాజమౌళి బ్రాండ్ వాల్యూ ఇంటర్నేషనల్ లెవెల్ కు చేరుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆ క్రేజ్ మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర లాంగ్వేజెస్, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఆ చిత్రానికి భారీ డిమాండ్ కనిపించింది. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ ద్వారా విడుదలకు ముందే పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగింది.
ఇప్పుడు అదే అంచనాలు వారణాసిపై కనిపిస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఆ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అఫీషియల్ గా కంప్లీట్ బిజినెస్ డిటైల్స్ బయటకు రాకపోయినా, ఓటీటీ రైట్స్ కోసం బడా ప్లాట్ ఫామ్స్ ఆసక్తి చూపుతున్నాయనే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మేకర్స్ ఒక్క ఓటీటీ డీల్ ద్వారానే రూ.500 కోట్లు ఆశిస్తున్నట్లు వినికిడి.
అయితే వారణాసి బడ్జెట్ రూ.1000 కోట్ల రేంజ్ లో ఉండొచ్చని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో ఓటీటీ డీల్ వాల్యూ రూ.500 కోట్లు అయితే.. మిగతా డీల్స్ తోనూ పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. దీంతో రాజమౌళి బ్రాండ్, మహేష్ బాబు స్టార్ డమ్ కలిసి రావడంతో విడుదలకు ముందే రికార్డు లెవెల్ బిజినెస్ జరిగి.. భారీ టేబుల్ ప్రాఫిట్ తీసుకురావచ్చనే అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో గతంలో రాజమౌళి సినిమాలు సాధించిన బిజినెస్ రికార్డులు చూస్తే, వారణాసి వాటిని బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. విడుదలకు ముందే భారీ బిజినెస్ జరగడం రాజమౌళి సినిమాలకు అలవాటైపోయింది. అదే ట్రెండ్ కొనసాగితే వారణాసి ఆయన కెరీర్ లోనే హైయెస్ట్ టేబుల్ ప్రాఫిట్ సాధించిన చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.