రియల్‌ హీరోకు గుడి కట్టిన తండా వాసులు

Update: 2020-12-21 08:30 GMT
లాక్‌ డౌన్‌ సమయంలో వలస కార్మికులకు సాయంగా నిలిచి కోట్ల రూపాయలను ఖర్చు చేసి వారిని స్వస్థలాలకు చేరడంలో కీలకంగా వ్యవహరించిన సోనూసూద్‌ రియల్‌ హీరో అంటూ అభినందనలు దక్కించుకున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా కష్టాల్లో ఉన్న వారి గురించి తెలుసుకుని చేతనైనంత సాయంను చేసేందుకు ముందుకు వస్తున్న సోనూసూద్‌ మరింతగా పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇటీవలే విద్యార్థుల కోసం ప్రతి ఏడాది స్కాలర్‌ షిప్‌ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇంతటి మంచి పనులు చేస్తున్న సోనూసూద్‌ ను దేవుడు అంటున్నారు.

సోనూసూద్‌ ను దేవుడిగా పొగుడుతున్న వారు కొందరు అయితే మరి కొందరు ఏకంగా గుడి కట్టి మరీ ప్రార్థిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా దుబ్బ తండా గ్రామ పంచాయితీలో సోనూసూద్ కు గుడి కట్టారు. తండాకు చెందిన సోనూ సూద్‌ అభిమానులు.. యువజన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంను నిర్వహించారు. సోనూసూద్‌ ప్రతిమను తయారు చేయించడంతో పాటు ఆ ప్రతిమకు పూజలు కూడా చేయడం మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విలన్‌ గా నటించే నటుడికి ఇలా గుడి కట్టడం ఇదే ప్రథమం. సోనూసూద్‌ ఇందుకు పూర్తి గా అర్హుడు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News