సునీల్ సినిమాలో ఇన్ని కోణాలా?

Update: 2016-09-14 22:30 GMT
నెలన్నర కిందటే ‘జక్కన్న’తో పలకరించాడు సునీల్. హీరోగా అది అతడికి వరుసగా నాలుగో ఫ్లాప్. ఐతే ‘జక్కన్న’ గురించి మరిచిపోకముందే ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాతో వచ్చేస్తున్నాడు ఈ కమెడియన్ టర్న్డ్ హీరో. ఈ నెలలోనే వస్తుందనుకున్న ఈ చిత్రం దసరా రేసులో నిలిచింది. వచ్చే నెల 7న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదిలేశారు. ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అనే తరహాలో పబ్లిసిటీ చేస్తున్నారు.

‘ఈడు గోల్డ్ ఎహే’కు సంబంధించి నాలుగు రకాల పోస్టర్లు వదిలాడు నిర్మాత అనిల్ సుంకర. ‘ఇట్ ఈజ్ క్లాస్’ అంటూ సునీల్ సూటేసుకుని హీరోయిన్ వెంట పరుగెడుతున్న పోస్టర్ ఒకటి.. ‘ఇట్ ఈజ్ మాస్’ అంటూ హీరోయిన్లు ఇద్దరితో కలిసి ఊర మాస్ అవతారంలో సునీల్ స్టెప్పులేస్తున్న పోస్టర్ ఒకటి.. ‘ఇట్స్ ఎ థ్రిల్లర్’ అంటూ సునీల్ రెండు అవతారాల్లో సీరియస్ గా ఉన్న పోస్టర్ మరొకటి.. చివరగా ఇందులో తారాగణాన్నంతా చూపిస్తూ ‘ఎట్స్ ఎన్ ఎంటర్టైనర్’ అంటూ చివరగా ఇంకో పోస్టర్.. ఇలా నాలుగు రకాల పోస్టర్లు రిలీజ్ చేశారు.

మొత్తానికి దసరా పండక్కి రాబోయే హోల్ సమ్ ఎంటర్టైనర్ ‘ఈడు గోల్డ్ ఎహే’ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఏముందో ఏమో కానీ.. సునీల్ కెరీర్ కు మాత్రం ‘ఈడు గోల్డ్ ఎహే’ ఎంతో కీలకం. వీరూ పోట్ల సైతం సునీల్ ను కాపాడలేకపోతే ఇక అంతే సంగతులు. ఐతే విపరీతమైన పోటీ మధ్య వస్తున్న సునీల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం నిలబడుతుందో చూడాలి.
Tags:    

Similar News