కాటమరాయుడు.. అసలేంటి కథ?

Update: 2017-03-23 05:28 GMT
కాటమరాయుడు.. భలే పాపులర్ అయిన టైటిల్ ఇది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో వచ్చే కాటమరాయుడా కదిరి నరసింహుడా అనే పాటతోనే ఈ పేరు జనాల నోళ్లలో బాగా నానింది. ఆ సినిమాలో ఆ పాట అసందర్భంగా అనిపించినప్పటికీ.. పవన్ ఆ పాటను పాడిన తీరు.. అందులోని పదాలు జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘కాటమరాయుడు’ అనే టైటిల్ పెట్టుకుని సినిమానే చేసేశాడు పవన్. సప్తగిరి తన సినిమాకు ఈ పేరు పెట్టుకుంటే అడిగి మరీ పవన్ కోసం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏ పవన్ సినిమా టైటిల్ లేనంతగా ఈ టైటిల్ జనాల నోళ్లలో నానింది. ఐతే ఈ ‘కాటమరాయుడు’ ఎవరు.. ఆ పేరు వెనుక కథేంటి అన్నది జనాలకు పెద్దగా తెలియదు. ఆ సంగతేంటో చూద్దాం పదండి.

శ్రీ మహావిష్ణువు సగం మనిషిగా.. సగం సింహంగా నరసింహావతారంలో వచ్చి హిరణ్య కశిపుడిని అంతమొందించిన సంగతి తెలిసిందే. హిరణ్య కశిపుడి సభా మండపంలోని స్తంభం నుంచి వచ్చాడు కాబట్టి స్తంభానికి మరో పేరైన ‘కంబం’ను ఆధారంగా చేసుకుని మహా విష్ణవును కంబాలరాయుడని కూడా భక్తులు పిలుచుకుంటాడు. ఐతే అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని గొడ్డు వెలగల సమీపంలోని కొండపై చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహ స్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని ‘కాటం’ అనే కుగ్రామం కూడా ఉండటంతో అక్కడి వారు కంబాలరాయుడిని ‘కాటమరాయుడు’ అని పిలుచుకుంటారు. అన్నమాచార్యులు సైతం తన కీర్తనల్లో సైతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడా అని కీర్తించారు. ఇక్కడి వాళ్లే భేట్రాయిస్వామి అనే పేరుతోనూ దేవుడిని పిలుస్తారు. అందుకే కాటమరాయుడా పాటలో కదిరి నరసింహుడా అని.. భేట్రాయిస్వామి దేవుడా అనే పదాలు కూడా వస్తాయి. ‘కాటమరాయుడు’ అనే పేర్లు అనంతపురం జిల్లాలో కొంతమందికి ఉంటాయి. పవన్ ఇప్పుడు తన పాత్రకు.. తన సినిమాకు అదే పేరు పెట్టుకుని వస్తున్నాడు. ఈ సినిమా నడిచేది కూడా అనంతపురం బ్యాక్ డ్రాప్ తోనే కావడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News