దర్శకుల సామర్థ్యాన్ని నమ్మి ముందుకెళ్తున్న స్టార్ హీరోలు..!

Update: 2021-05-29 01:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటికే పరిమితమైన హీరోలు కొత్త కథలను వింటుంటే.. స్టార్ డైరెక్టర్స్ కొత్త స్క్రిప్టులతో హీరోలను మెప్పించే పనిలో ఉన్నారు. ప్రెజెంట్ వాళ్ళు డైరెక్ట్ చేస్తున్న సినిమాలు రిలీజ్ అవ్వకపోయినా.. దర్శకుల ప్రీవియస్ సినిమాల రిజల్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని స్టార్ హీరోలు సినిమాలకు సైన్ చేస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే జక్కన్న తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద నమ్మకంతో కంప్లీట్ స్క్రిప్టు వినకుండానే మహేష్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 'కేజీఎఫ్ 2' రిలీజ్ కాకముందే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' సినిమా మొదలుపెట్టేసాడు. ఇదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 31వ చిత్రానికి కమిట్ అయ్యాడు. మహేష్ - అల్లు అర్జున్ లతో కూడా చర్చలు జరుపుతున్నారు ప్రశాంత్.

'ఆచార్య' సినిమా ఇంకా పూర్తి కాకుండానే దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. 'జనతా గ్యారేజ్' డైరెక్టర్ మీద నమ్మకంతో తారక్ స్క్రిప్టు కూడా వినకుండా ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేశాడని తెలుస్తోంది. 'పుష్ప' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సుకుమార్.. రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నారు. 'ఇండియన్ 2' సినిమా ఏమవుతుందో అని ఆలోచించకుండా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీకి సైన్ చేశాడు చరణ్. 'ఎఫ్ 3' సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి.. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ను ఓ కథతో మెప్పించినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే ప్రస్తుతం చేస్తున్న సినిమాల రిజల్ట్ గురించి ఆలోచించకుండా.. వారి సామర్థ్యం మీద నమ్మకంతో స్టార్ హీరోలు కొత్త ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్నారని అర్థం అవుతోంది.
Tags:    

Similar News