15,000 కోట్ల ఆస్తి చిక్కుల్లో.. 16 ఎక‌రాల కేసులో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్, ఆయన కుటుంబానికి సంబంధించి తాజాగా మధ్యప్రదేశ్ కోర్టులో ఒక కీలకమైన న్యాయ విజయం లభించింది.;

Update: 2026-01-12 17:22 GMT

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్, ఆయన కుటుంబానికి సంబంధించి తాజాగా మధ్యప్రదేశ్ కోర్టులో ఒక కీలకమైన న్యాయ విజయం లభించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఆస్తి వివాదంలో కోర్టు సైఫ్ అలీ ఖాన్ పక్షాన తీర్పునిచ్చింది. కేసు పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

భోపాల్‌లోని నయాపురా ప్రాంతంలో ఉన్న సుమారు 16.62 ఎకరాల ఖరీదైన భూమిపై హక్కుల కోసం అఖీల్ అహ్మద్, ఆయ‌న అనుయాయులు 1998లో కోర్టును ఆశ్రయించారు. 1936లో అప్పటి భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ ఈ భూమిని తమ పూర్వీకులకు బహుమతిగా ఇచ్చారని వారు వాదించారు.

అయితే ఈ భూమి సైఫ్ ఖాన్ స్వాధీనంలో ఉంది. దీంతో భోపాల్‌లోని జిల్లా కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్లు ఆ భూమి తమదే అనడానికి ఎటువంటి బలమైన ఆధారాలు, డాక్యుమెంట్లు సమర్పించలేకపోయారు.రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ఎప్పుడూ నవాబు కుటుంబం (పటౌడీ ఫ్యామిలీ) పేరు మీదనే ఉంది. ఈ కేసు దాఖలు చేయడంలో చాలా జాప్యం జరిగిందని కోర్టు పేర్కొంది. దీంతో సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ , సోదరీమణుల యాజమాన్య హక్కులను కోర్టు ధృవీకరించింది.

అయితే భోపాల్‌లోనే ఉన్న మరో భారీ ఆస్తి (సుమారు రూ.15,000 కోట్ల విలువైనది) కి సంబంధించి గతేడాది సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఆ ఆస్తులను `శత్రువు ఆస్తి`గా గుర్తించింది. దీనిపై సైఫ్ అలీ ఖాన్ కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గతంలో తిరస్కరించింది. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరపాలని హైకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించింది. అంటే ఈ ఆస్తుల విషయంలో తుది పోరాటం ఇంకా సాగుతూనే ఉంది.

శ‌త్రువు ఆస్తి అంటే ఏమిటి?

శత్రువు ఆస్తి అంటే, నాటి దేశ‌ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిన నవాబు పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ కారణంగా, ఆ ఆస్తులను `శత్రువు ఆస్తి`గా ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూలైలో మధ్యప్రదేశ్ హైకోర్టు గతంలో సైఫ్ అలీ ఖాన్ వారసత్వ హక్కులను సమర్థిస్తూ వచ్చిన 25 ఏళ్ల నాటి తీర్పును రద్దు చేసింది. దీనివల్ల ఈ వేల కోట్ల ఆస్తి వివాదంపై మళ్ళీ కొత్తగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.

పటౌడీ సంస్థాన ఆస్తుల వివ‌రాల్లోకి వెళితే.. ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ చాలా ఫేమ‌స్. ఇది సైఫ్‌ అలీ ఖాన్ బాల్యం గడిపిన ప్రదేశం. నూర్-ఉస్-సహాబ్ ప్యాలెస్ ప‌రిస‌రాల్లో ప్రస్తుతం ఒక లగ్జరీ హోటల్‌ నడుస్తోంది. నైపరా స‌హా వందల ఎకరాల భూములు సైఫ్ కి ఉన్నాయి.

మొత్తానికి 16 ఎకరాల భూవివాదం పరిష్కారం కావడం నవాబ్ ఆఫ్ పటౌడీ కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చే విషయమే! సైఫ్ అలీ ఖాన్ ఇటీవ‌ల టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ప్ర‌భాస్ ఆదిపురుష్, ఎన్టీఆర్ దేవరలో అత‌డు న‌టించాడు.

Tags:    

Similar News