‘సంక్రాంతికి వస్తున్నాం’ మ్యాజిక్ మళ్లీ రిపీట్?
గత ఏడాది సంక్రాంతికి గేమ్ చేంజర్ లాంటి భారీ చిత్రం రిలీజైంది. దీంతో పాటు డాకు మహారాజ్ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది.;
గత ఏడాది సంక్రాంతికి గేమ్ చేంజర్ లాంటి భారీ చిత్రం రిలీజైంది. దీంతో పాటు డాకు మహారాజ్ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. వీటితో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా స్థాయి తక్కువ. కానీ చివరికి బాక్సాఫీస్ దగ్గర అదే విజేతగా నిలిచింది. ఎవ్వరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. గేమ్ చేంజర్ డిజాస్టర్ కాగా.. డాకు మహారాజ్ ఎబోవ్ యావరేజ్ మూవీగా నిలిచింది. అలా అని సంక్రాంతికి వస్తున్నాం గొప్ప సినిమా అనలేం. కంటెంట్ పరంగా అదొక యావరేజ్ మూవీ. అంత కొత్తగా ఏమీ ఉండదు. కానీ కామెడీ బాగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా సంక్రాంతి టైంలో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లలో చూడాలనుకునే సినిమాలా అదొక్కటే ఉండడం దానికి బాగా కలిసొచ్చింది. దీంతో ఏకంగా రూ.300 కోట్ల దాకా వసూళ్లు కొల్లగొట్టింది సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమా రేంజికి ఆ వసూళ్లను ఎవ్వరూ ఊహించలేదు.
ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి మ్యాజిక్కే జరిగేలా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం దర్శకుడు అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవి కలయికలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకునేలా కనిపిస్తోంది. ఈ సంక్రాంతి అత్యంత భారీ చిత్రమైన రాజాసాబ్‌కు డివైడ్ టాక్ రావడం ఈ చిత్రానికి అతి పెద్ద ప్లస్. అదే సమయంలో మన శంకర వరప్రసాద్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇది కూడా సంక్రాంతికి వస్తున్నాం తరహాలోనే కంటెంట్ పరంగా ఓ మోస్తరు సినిమాగా చెప్పొచ్చు. అంత కొత్తగా ఏమీ ఉండదు. కానీ పండుగ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి సినిమానే చూడాలనుకుంటారు. అనిల్ మార్కు కామెడీకి చిరు స్టార్ పవర్ కూడా తోడవడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అంచనాలను మించిన స్పందన వస్తోంది. తొలి రోజు ప్యాక్డ్ హౌస్‌లతో నడుస్తోంది. మిగతా మూడు సంక్రాంతి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. చిరు సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టేలా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంను మించి దీనికి వసూళ్లు వస్తే ఆశ్చర్యమేమీ లేదు.