క్రేజీ ప్లాన్.. ఇకపై థియేటర్లకు క్యూ కడతారా?
మంచి కథలతో సినిమాలు వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లాలంటే రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కారణం మాత్రం క్లియర్ గా అందరికీ తెలిసిందే.;
థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిందనే మాట గత కొంతకాలంగా తరచూ వినిపిస్తోంది. మంచి కథలతో సినిమాలు వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లాలంటే రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కారణం మాత్రం క్లియర్ గా అందరికీ తెలిసిందే. టికెట్ ధరలు పెరగడం, థియేటర్ లో ఫుడ్ అండ్ బేవరేజ్ ఖర్చులు భారీగా ఉండటం వల్ల నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సినిమా చూడటం ఒక పెద్ద ఖర్చుగా మారింది.
నలుగురు కలిసి వెళ్లాలంటే వెయ్యి, రెండు వేలు రూపాయలు ఖర్చవుతుండటంతో చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించే ప్రయత్నంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది ఈటీవీ విన్. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని టికెట్లు, పాప్‌కార్న్ ను కలిపి స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల కాలంలో టికెట్ రేట్లు మాత్రమే కాదు, పాప్‌కార్న్, కోల్డ్ డ్రింక్స్ ధరలు కూడా ప్రేక్షకులకు భారంగా మారాయి. థియేటర్ లో ఒక్క లార్జ్ పాప్‌కార్న్ కొనాలన్నా వందల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీంతో చాలామంది ఫుడ్ కొనకుండా ఉండటమే కాకుండా, మొత్తం సినిమా ప్లాన్ నే క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ సమస్యను గమనించిన నిర్వాహకులు కుటుంబానికి సరిపోయే బడ్జెట్ ప్యాక్ అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు.
త్వరలో విడుదల కానున్న తమ తాజా చిత్రం సంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీ కోసం ఆ ఆఫర్ ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది ఈటీవీ విన్. సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. అందుకే ఎక్కువ మంది కుటుంబాలతో థియేటర్‌కు రావాలనే ఉద్దేశంతో ప్రత్యేక ధరలు ప్రకటించడం విశేషం.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో నాలుగు టికెట్లు, ఒక లార్జ్ పాప్ కార్న్ కలిపి కేవలం రూ.499కే అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఉన్న రేట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర. అంటే ఒక్కో టికెట్ దాదాపు వంద రూపాయల పరిధిలో పడుతుంది. ఇదే మల్టీప్లెక్స్ లలో అయితే నాలుగు టికెట్లు, ఒక లార్జ్ పాప్ కార్న్ తో రూ.799కి ప్యాకేజ్ ఇవ్వనున్నారు. పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియెన్స్ ను తక్కువ ఖర్చుతో ఆస్వాదించేలా ప్లాన్ ను రూపొందించారు.
దీంతో ఇలాంటివి ఉంటే తప్పకుండా థియేటర్ కే వెళ్తామని, ఫ్యామిలీతో వెళ్లడానికి ఇది బెస్ట్ డీల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది బిగ్ రిలీఫ్ అని అభిప్రాయపడుతున్నారు. ఆ ప్లాన్ విజయవంతమైతే ఇతర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇలాంటి ఆఫర్లతో ముందుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలా జరిగితే థియేటర్లలో మళ్లీ రద్దీ పెరిగే అవకాశం ఉంది. థియేటర్ల వద్ద మళ్లీ ఆడియన్స్ మళ్లీ క్యూలు కట్టే రోజులు రావచ్చన్న ఆశలు కనిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.