బేబీ మ్యాజిక్ రిపీటవుతుందా?
కొన్ని వారాల పాటు నిలకడగా వసూళ్లు సాధించిన ‘బేబీ’ ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ సైతం దీని వల్ల దెబ్బ తింది అంటే అతిశయోక్తి కాదు.
మూడేళ్ల ముందు ఇదే నెలలో ‘బేబీ’ అనే చిన్న సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లాంటి అప్ కమింగ్ నటులు ముఖ్య పాత్రలు చేసిన ఆ చిత్రానికి విడుదలకు ముందు బాగానే బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కొనియాడిన వాళ్లున్నారు. అలాగే విమర్శించిన వాళ్లూ ఉన్నారు.
మొత్తంగా ఒక పెద్ద డిస్కషన్ పాయింట్‌గా మారి ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిందా చిత్రం. కొన్ని వారాల పాటు నిలకడగా వసూళ్లు సాధించిన ‘బేబీ’ ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ సైతం దీని వల్ల దెబ్బ తింది అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ అందించిన కథతో.. ఆయన, ఎస్కేఎన్ కలిసి నిర్మించిన చిత్రమే.. చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించాడు. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బేబీ’ తరహలోనే దీనికి కూడా ముందు రోజు పెద్ద ఎత్తున పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నారు. వాటికి బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి బజ్ కనిపిస్తోంది. కానీ ‘బేబీ’ తరహాలో సెన్సేషనల్ కంటెంట్ ఇందులో ఉందా.. దాని లాగే ఇదీ చర్చనీయాంశం అవుతుందా అన్నది చూడాలి. పెయిడ్ ప్రిమియర్స్‌కు వచ్చే టాక్‌ను బట్టే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.
గురువారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో అందరూ ఈ సినిమా ఎలా చర్చించుకుంటారా అని టీం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. పెయిడ్ ప్రిమియర్స్ వల్ల బాగున్న సినిమాకు ఎంత మేలు జరుగుతుందో.. బాలేని చిత్రానికి అంత చెడు కూడా జరుగుతుంది. మరి ‘బేబీ’ మ్యాజిక్‌ను ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా రిపీట్ చేస్తూ మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర మరో సెన్సేషన్‌గా నిలుస్తుందేమో చూడాలి.