సితార ఘట్టమనేని ఎంట్రీపై ఆసక్తికర చర్చ: సూపర్ స్టార్ వారసురాలి సినీ ప్రయాణం ఎప్పుడు?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ నటవారసుల వెల్లువ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.
కొన్ని ప్రకటనలు.. కొన్ని అతిథి పాత్రలు సరే కానీ.. పూర్తి స్థాయి నటిగా ప్రిన్సెస్ సితార ఘట్టమనేని అడుగులు వేస్తారా? స్టడీస్ ఎంతవరకూ వచ్చాయి?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ నటవారసుల వెల్లువ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ తెరంగేట్రానికి సిద్ధమవుతుండగా... మరోవైపు టాలీవుడ్‌లో ఘట్టమనేని కుటుంబం నుంచి దివంగత నటుడు, నిర్మాత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఆరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో మునుముందు తెలుగు చిత్రసీమలో పలువురు స్టార్ల వారసులు బరిలో దిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంతో పాటు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని సినీ తెరంగేట్రం ఎప్పుడు? అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అయితే సితార పూర్తి స్థాయి నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తల్లి నమ్రత స్పష్టం చేశారు. సితార వయస్సు ఇంకా చాలా చిన్నది... ప్రస్తుతం తను చదువుపైనే పూర్తి దృష్టి పెడుతోందని.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు చాలా సమయం ఉందని ఇటీవల ఒక మీడియాతో ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పూర్తి స్థాయి సినిమాలు చేయకపోయినా... సితార చిన్న వయస్సులోనే గ్లోబల్ లెవెల్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మహేష్ బాబు నటించిన `సర్కారు వారి పాట` చిత్రంలోని `పెన్నీ` ప్రమోషనల్ సాంగ్‌లో డాన్స్ చేసి ఆకట్టుకోవడమే కాకుండా.. ప్రముఖ యానిమేషన్ చిత్రం `ఫ్రోజెన్ 2` తెలుగు వర్షన్‌లో `బేబీ ఎల్సా` పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. అంతేకాకుండా పిఎమ్‌జె (PMJ) జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసిన అత్యంత పిన్న వయస్కురాలైన స్టార్ కిడ్‌గా చరిత్ర సృష్టించింది. ఆ ప్రచారం ద్వారా వచ్చిన తన మొదటి సంపాదన 1 కోటిని ఛారిటీకి విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది.
భవిష్యత్తులో సితార పూర్తి స్థాయి నటిగా అడుగులు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్వయంగా సితార కూడా ఇంటర్వ్యూలలో మాట్లాడూతూ.. తనకు యాక్టింగ్, మోడలింగ్ రెండింటిపై చాలా ఆసక్తి ఉందని వెల్లడించింది. ఘట్టమనేని కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. నాన్న కూచీగా సోషల్ మీడియాలో పబ్లిక్ అప్పియరెన్స్.. నటన, డ్యాన్స్ ప్రతిభతో ఇప్పటికే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సితార చదువు పూర్తయ్యాక సిల్వర్ స్క్రీన్‌పై అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం సితార హైదరాబాద్‌లోని `చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్` లో తన విద్యను అభ్యసిస్తోంది. స్కూల్ చదువుకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కేవలం వెకేషన్స్..ఖాళీ సమయాల్లో మాత్రమే బ్రాండ్ షూట్స్, ఈవెంట్లలో పాల్గొంటోంది. చదువుతో పాటు కూచిపూడి.. వెస్టర్న్ బ్యాలే డ్యాన్స్ రూపాల్లో ప్రత్యేక శిక్షణ పొందుతూ తన ప్రతిభకు పదును పెడుతోంది. అన్ని విధాలా సిద్ధమవుతున్న ఈ చిన్నారి ఘట్టమనేని ప్రిన్సెస్ భావి తరంలో టాలీవుడ్ స్టార్‌గా వెలిగిపోతుందనడంలో సందేహం లేదు. సితార బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు విషెస్ చెబుతూ `లిటిల్ స్టార్` అంటూ బిరుదునిచ్చారు. అలాగే ఒక అందమైన ఫోటోగ్రాఫ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫోటోగ్రాఫ్ లో సితార బుగ్గపై ముద్దాడుతూ కూతురిపై తన ప్రేమను ఆవిష్కరించారు. ఈ యూనిక్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.