‘రామాయణ’ ఎడిటింగ్ రూమ్ లోకి హాలీవుడ్ లెజెండ్..?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రామాయణ’ సినిమా గురించిన చర్చలే నడుస్తున్నాయి.;
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రామాయణ’ సినిమా గురించిన చర్చలే నడుస్తున్నాయి. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ పై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వస్తోంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఒక క్రేజీ రూమర్ తెగ వైరల్ అవుతోంది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఇండియాలో రూపొందుతున్న ఈ ఎపిక్ మూవీ ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చోబోతున్నారనే వార్త ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అసలు నోలన్ కి మన రామాయణానికి లింక్ ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రఖ్యాత విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ‘DNEG’కి సీఈఓ కూడా. నోలన్ తీసిన ఇంటర్‌స్టెల్లార్ వంటి భారీ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించింది ఈ సంస్థే. ఈ క్రమంలో నమిత్ మల్హోత్రాతో నోలన్‌కు మంచి స్నేహం ఉంది. ఈ పరిచయం వల్లే మన రామాయణానికి నోలన్ సలహాలు ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నోలన్ సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడైన హన్స్ జిమ్మర్ ఈ రామాయణ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ తో కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తుండటంతో, నోలన్ ఈ సినిమా మేకింగ్‌లో ఇన్వాల్వ్ అవుతారనే వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. ఒకవేళ నిజంగానే నోలన్ ఎడిటింగ్ రూమ్ లోకి వస్తే మన ఇతిహాస గాథను ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్‌లో ప్రెజెంట్ చేయడం ఖాయం.
కేవలం రూమర్ అని కొట్టిపారేయడానికి వీల్లేకుండా ఈ సినిమా బడ్జెట్ కూడా రూ. 4000 కోట్లుగా ఉంది. ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ టెక్నీషియన్ల సాయం తీసుకోవడం సహజమే. నోలన్ తన సినిమాల్లో అనుసరించే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లేదా డిఫరెంట్ ఎడిటింగ్ స్టైల్ గనుక రామాయణానికి తోడైతే, అది ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ ఆంజనేయుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో ప్రతి పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. రణబీర్ కపూర్ రాముడిగా సరికొత్త లుక్‌లో మెరవబోతున్నారు. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 2026 దీపావళికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతమంది స్టార్స్ ఉన్న సినిమాలో నోలన్ పేరు వినిపించడమే ఇప్పుడు సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది.
ఇక నోలన్ స్వయంగా ఎడిటింగ్ చేస్తారా లేక కేవలం తన ఫ్రెండ్ నమిత్ కోసం కొన్ని సూచనలు ఇస్తారా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మన పురాణ గాథను గ్లోబల్ లెవల్‌లో చూపించడానికి మేకర్స్ చేస్తున్న ఈ ప్రయత్నం మెచ్చుకోదగినదే. ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే రామాయణ ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా నిలిచిపోతుంది.