రూ.2000 కోట్లు కష్టం కాకపోవచ్చు..!

ఈమధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు, సౌత్‌ సినిమాలు వెయ్యి కోట్ల మార్క్‌ను సునాయాసంగా చేరుకుంటున్నాయి.;

Update: 2026-03-04 05:24 GMT

ఈమధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు, సౌత్‌ సినిమాలు వెయ్యి కోట్ల మార్క్‌ను సునాయాసంగా చేరుకుంటున్నాయి. స్టార్‌ హీరోల క్రేజ్‌, వివాదాస్పద సబ్జెక్ట్‌ లు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు కురిపిస్తున్నాయి. ప్రేక్షకులకు కనెక్ట్‌ అయితే వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు కావడం పెద్ద కష్టం ఏమీ కాదు అని పలు సినిమాలు నిరూపితం చేశాయి. గత ఏడాది చివర్లో వచ్చిన 'ధురంధర్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లు చేస్తే చాలా పెద్ద విషయం అనుకున్నారు. కానీ సినిమాలోని మ్యాటర్‌ కారణంగా, సినిమాకు వచ్చిన పాజిటివ్‌ రెస్పాన్స్ కారణంగా, సినిమా చుట్టూ నెలకొన్ని వివాదాల కారణంగా విడుదలైన తర్వాత భారీగా పబ్లిసిటీ దక్కింది. మొదటి వారం తో పోల్చితే రెండో వారం అత్యధిక వసూళ్లు నమోదు కావడం జరిగింది. ధురంధర్‌ సినిమా ఫైనల్‌గా వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ధురంధర్‌ మూవీ కలెక్షన్స్‌..

ధురంధర్‌ సినిమా దాదాపు నాలుగు వారాల పాటు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసింది. పైగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాస్త ఆలస్యం అయిన కారణంగా వసూళ్లు మరింత ఎక్కువగా నమోదు అయ్యాయి అనే టాక్‌ ఉంది. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన తర్వాత కూడా అత్యధికులు స్ట్రీమింగ్‌ చేశారని రికార్డ్‌లు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు ధురంధర్‌ 2 సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు కల్పిస్తూ పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మార్చి 19న ధురంధర్‌ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ అంచనాలు పెంచేసింది. ఇండియాలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం కాలేదు. కానీ యూఎస్‌లో ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

రణ్వీర్‌ సింగ్‌, ఆదిత్య ధర్‌ కాంబో మూవీ...

రణ్వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించారు. మొదటి పార్ట్‌లో రణ్వీర్‌సింగ్‌ పాత్రను దర్శకుడు చూపించిన తీరు అద్భుతంగా ఉంది. పాకిస్తాన్‌లో స్పై జీవితం ఎలా సాగుతుంది అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించి సక్సెస్ అయ్యాడు. సెకండ్‌ పార్ట్‌లో అంతకు మించిన మ్యాటర్‌ ఉంటుందని చెప్పకనే చెబుతున్నట్లుగా ట్రైలర్ ఉంది. అందుకే యూఎస్‌లో ప్రీ సేల్‌ అదిరి పోతుందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే దాదాపు 1.3 లక్షల డాలర్లను ధురంధర్‌ 2 రాబట్టింది. దాదాపుగా 600 షో లు షెడ్యూల్‌ అయ్యాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 8 వేల టికెట్లు బుక్ అయ్యాయి. టాక్సిక్ సినిమా అదే రోజున విడుదల కాబోతున్నప్పటికీ ధురంధర్‌ 2 వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు.

ధురంధర్‌ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద...

బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ సినిమాతో ధురంధర్‌ 2 గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని, తద్వారా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా యశ్‌ నటించిన టాక్సిక్ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దాంతో ధురంధర్‌ 2 కి పోటీ లేదు. సోలోగా బాక్సాఫీస్‌ ను షేక్‌ చేయడం ఖాయం. అందుకే ధురంధర్‌ 2 సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినా, ధురంధర్‌ 1 ను మించి ఉందని టాక్‌ వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద రూ.2 వేల కోట్ల వసూళ్లు నమోదు చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

ఈ మధ్య కాలంలో వచ్చిన పలు సీక్వెల్స్‌ వసూళ్లను పరిశీలిస్తే ధురంధర్‌ 2 కి అన్ని కలిసి వచ్చే అంశాలు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ధురంధర్‌ 2 సినిమాను కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఇండియన్‌ భాషల్లోనూ డబ్‌ చేయడం వల్ల మరింతగా కలెక్షన్స్ ఉంటాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఇండియాలో వెయ్యి కోట్లు దాటడం ద్వారా రికార్డ్‌ను ధురంధర్‌ 2 నమోదు చేయబోతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. మరో రెండు వారాల్లో రాబోతున్న ధురంధర్‌ 2 ఎన్ని రికార్డ్‌లను బ్రేక్‌ చేయనుందో చూడాలి.

Tags:    

Similar News